● ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మార్కాపురం టౌన్: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు తథ్యమని పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిని డాక్టర్ చప్పల్లి కనకదుర్గ నివాసంలో శుక్రవారం ఆమెను కలిసి చెవిరెడ్డి మాట్లాడారు. వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి జరిగిన మేలును ప్రజలు గుర్తుచేసుకోవాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని గుర్తించి ఓటర్లు కనకదుర్గకు మద్దతు ఇవ్వాలని చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కేవలం అధికారం కోసం అనేక హామీలిచ్చి తరువాత వాటిని తుంగలో తొక్కడం కూటమి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. చెవిరెడ్డి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం, పత్తి కృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, నాలి కొండయ్య యాదవ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


