అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి వివరాలు వెల్లడించిన కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో ఎన్నికల నిర్వహణ వివరాలు వెల్లడించారు. ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ రూంలో శుక్రవారం సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలింగ్, బందోబస్తు, పర్యవేక్షణకు సంబంధించి తమ శాఖల ద్వారా చేపట్టిన పూర్తి స్థాయి చర్యలను కలెక్టర్, ఎస్పీ వివరించారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 1వ తేదీన చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలకు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ మూడు అర్బన్ ప్రాంతాల పరిధిలో మొత్తంగా 303 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, వీటన్నింటికీ సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ ఆఫీసర్లు, మైక్రో ఆఫీసర్లు (అబ్జర్వర్లు) అందరూ కలిపి మొత్తం 2,284 మంది సిబ్బందిని ఎంపిక చేసి, వారికి ఇప్పటికే పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. బ్యాలెట్ మెటీరియల్ అంతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచామని, శనివారం ఉదయమే పంపిణీ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని, పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్లు అందరూ ఉదయం 6 గంటలకల్లా ఆయా పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకోవాలన్నారు.
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం: ఎస్పీ
ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ నవంబర్ 1న జరుగుతున్న అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల కోసం పోలీసు శాఖ తరఫున సరిపడా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 303 పోలింగ్ స్టేషన్లలో 100 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 107 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆ ప్రకారం తగినంత బందోబస్తు కేటాయించామని వెల్లడించారు. 3వ తేదీ రైజ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు.


