అగ్రనేతల పర్యటనలతో వైఎస్సార్ సీపీ జోష్ ఒంగోలులో కలహాలతో కూటమి గందరగోళం తాయిలాలు, నగదు పంపిణీపై ఆశలు పోలీసులతో వైఎస్సార్ సీపీ నేతలకు బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పురపోరు ప్రచారపర్వం ముగిసింది. ఆదివారం ఎన్నిలకు ప్రధాన రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒంగోలు నగరంలో వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార కూటమిలో చివరి వరకూ పొత్తులపై గందరగోళం నెలకొంది. కూటమిలో ప్రధాన పక్షాలైన టీడీపీ, జనసేనల మధ్య పొత్తులు విషయంలో సమన్వయం కొరవడింది. జనసేన నాయకులు 18 డివిజన్లలో నామినేషన్లు వేశారు. అయితే చివరి వరకూ పొత్తుల విషయం తేలకపోవడంతో వారు నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో వారు పోటీలో నిలిచారు. అంతా అయిపోయాక మూడు పార్టీల పెద్దలు సమావేశమై ఆరు డివిజన్లు మాత్రమే జనసేనకు ఇచ్చినట్టు ప్రకటించారు. అయితే ఈ దశలో వెనక్కి తగ్గేదే లేదంటూ నామినేషన్లు వేసిన జనసేనలు డివిజన్లలో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఆయా డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోటీల్లో ఉన్న జనసేనలను నిలువరించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బయట ప్రాంతాల నుంచి మనుషులను తీసుకొచ్చి భయపెట్టినా వెనుకడుగు వేయలేదు. వారు శుక్రవారం సమయం ముగిసే వరకూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు.
ముందంజలో కుప్పం..
మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్, డివిజన్లలో పోటీచేస్తున్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ పెద్దలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఒంగోలు నగరాభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బూచేపల్లి విస్తృత ప్రచారం..
ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని కోరుతూ పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని చేపట్టారు. ఒంగోలు నగరంలో మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌తో కలసి పలు డివిజన్లలో పర్యటించారు. అలాగే అద్దంకి అభ్యర్థి వూడత్తు సురేష్, ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్‌తో కలసి ప్రచారం చేశారు. మార్కాపురంలో అభ్యర్థి డాక్టర్ డాక్టర్ చప్పల్లి కనకదుర్గ, మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబుతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. గిద్దలూరులో అభ్యర్ధి డా.భూమా నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డితో కలసి ప్రచారాన్ని చేపట్టారు. చీమకుర్తిలో అభ్యర్థి మేడగం శ్రీదేవి విజయాన్ని కోరుతూ మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మతో కలసి ప్రచారం చేశారు.
ప్రలోభాలపైనే టీడీపీ ఆశలు..
అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డదారుల్లో విజయం సాధించాలని టీడీపీ కుట్రలు పన్నుతోంది. ప్రలోభాలు ఎరగా చూపి గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఒంగోలు నగరంతోపాటు ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో మద్యం, నగదు పంపిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుందని సమాచారం. అలాగే ప్రత్యర్థులపై పోలీసులను ఉసిగొల్పి బెదిరింపులకు దిగుతోంది. గిద్దలూరులో బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాల నేతల పూర్తి సహకారం అందకపోవడంతో ఒంటరి పోరుసాగిస్తున్నారు.


