అద్దంకి: ‘ చిన్న పేద వైశ్య కుటుంబం నుంచి కష్టపడి హోల్‌సేల్ వ్యాపారవేత్తగా ఎదిగాను. అధికార పక్షం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వైఎస్సార్ సీపీ పక్షానే నిలబడ్డా. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉండడంతో మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాన’ని వైఎస్సార్ సీపీ అద్దంకి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పూడుత్తు సురేష్ అన్నారు. పట్టణాభివృద్ధిపై గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు కలిగేలా పాలన సాగించి దివంగత నేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి మరో రెండు అడుగులు వేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనరంజక పాలన సాగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే పథకాలు చేరాయి. అదే స్ఫూర్తితో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ చేయూతతో పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని చెప్పారు. ఆయన మాటల్లోనే
చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
పెళ్లి కానుక
సప్త సంకల్పాల మేనిఫేస్టోలో భాగంగా చింతలపూడి ఛారిటుబుల్ ట్రస్టు ద్వారా 18 ఏళ్లు నిండిన యువతుల వివాహానికి కులమతాలకు అతీతంగా తాళిబొట్టు, చీర, సారె, ఇతర వర్గాల వారికి బంగారు ఉంగరం, చీర సారె అందిస్తాం. ఏళ్ల తరబడి పరిష్కారం కాని భవానీ సెంటర్ ట్రాఫిక్ సమస్యకు అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతాం.
పదో తరగతి వరకు ఉచిత విద్య..
చింతలపూడి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.12 లక్షల ఆదాయం లోపు ఉన్న కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్య అందిస్తాం. క్రీడాభివృద్ధి కోసం పదెకరాల స్థలం కేటాయించి అందులో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు నిర్మిస్తాం. ప్రశాంత వాతావరణంలో వాకింగ్ ట్రాక్, వాకర్స్‌కు భద్రత కల్పిస్తాం.
శివారు కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం..
ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక కొన్ని కాలనీల్లో మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్‌కాలనీ, బ్రహ్మానందం కాలనీ, గుర్రాల కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, రాజీవ్ కాలనీ, గరటయ్య కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎన్టీఆర్‌కాలనీని మోడల్ కాలనీగా మార్చి పట్టణానికే తలమానికంగా చేస్తాం. గుర్రాల కాలనీల్లో కొండజాతుల వారికి స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం.
వంద పడకల వైద్యశాల ఏర్పాటుకు కృషి
రాష్ట్రీయరహదారి, జాతీయ రహదారుల మధ్యలో ఉండి నిత్యం ఇబ్బంది పడుతున్న అద్దంకి నియోజకవర్గ ప్రజలకు దగ్గరలో ఉన్నత వైద్యం లేదు. ఇరవై ఏళ్లనుంచి ఇక్కడున్న నేత ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మేం అధికారంలోకి రాగానే వంద పడకల వైద్యశాల ఏర్పాటు చేయిస్తాం.
ఎన్నెస్పీ కాలువ మురుగుకు
శాశ్వత పరిష్కారం.
పట్టణం నుంచి వెళుతున్న ఎన్నెస్పీ కాలువ ప్రస్తుతం మురుగుతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. ఆ కాలువను సుందరంగా తయారు చేసి మురుగు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటాం. పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే పట్టణాభివృద్ధికి విశేష కృషి చేస్తాం. అద్దంకి మున్సిపాలిటీ కౌన్సిల్ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారిని, చైర్‌పర్సన్ అభ్యర్థిగా నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీలో గెలిపించాలి సురేష్ అద్దంకి పట్టణ ప్రజలను అభ్యర్థించారు.
వ్యాపారంతో పాటు ప్రజా సేవ
భవానీ సెంటర్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం
సప్త సంకల్పాలతో ప్రజలకు చేయూత
శివారు కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యం
విద్య, వైద్య, క్రీడా రంగాలకు ప్రత్యేక ప్రణాళిక
వైఎస్సార్ సీపీ అద్దంకి చైర్మన్ అభ్యర్థి వూడత్తు సురేష్


