వైఎస్సార్‌ సీపీ జోరు.. కూటమిలో గిల్లికజ్జాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జోరు.. కూటమిలో గిల్లికజ్జాలు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

ఒంగోలు, చీమకుర్తి, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరుల్లో తుది దశకు చేరిన ప్రచారం రోడ్డుషోలు, ఇంటింటి ప్రచారాలతో వైఎస్సార్‌ సీపీలో జోష్‌ అభ్యర్థుల తరఫున పార్టీ ముఖ్య నేతల విస్తృత ప్రచారం సమన్వయం కొరవడంతో ఆపసోపాలు పడుతున్న కూటమి అభ్యర్థులు

పురపోరు ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా.. కూటమి పార్టీల్లో మాత్రం సీట్ల సర్దుబాటు చిచ్చు చల్లారడం లేదు. ఒంగోలు కార్పొరేషన్‌ నుంచి గిద్దలూరు మున్సిపాలిటీ వరకు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు బహిరంగ పోరుకు దారితీస్తున్నాయి. ఒంగోలులో జనసేన ప్రచారాన్ని అడ్డుకుంటామన్న హెచ్చరికలు.. అవసరమైతే పోలీసులను రంగంలోకి దింపుతారంటూ కూటమి నేతల నుంచే వస్తున్న ఆరోపణలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ప్రత్యర్థులతో తలపడాల్సిన మిత్రపక్షాలు.. పరస్పరం కత్తులు దూసుకుంటుండటంతో కూటమి సమన్వయం ప్రశ్నార్థకంగా మారింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి, అద్దంకి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి మున్సిపాలిటీలు ఉన్నాయి. సాంకేతిక కారణాలతో కందుకూరు, పొదిలిల్లో ఎన్నికలకు బ్రేక్‌ పడింది. టీడీపీ నేతలు పక్క జిల్లాల నుంచి రౌడీమూకలను తీసుకొచ్చి దౌర్జన్యకాండకు తెరతీయడంతో దర్శిలో చైర్మన్‌ అభ్యర్థితో పాటు, వార్డులకు నామినేషన్లు పడలేదు. కనిగిరిలో కూడా ఇదే తంతు. కూటమి నేతలు దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇక ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు కార్పొరేషన్‌, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతోంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో మేయర్‌, చైర్మన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు దూకుడు పెంచారు. రోడ్డుషోలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఒంగోలులో వైఎస్సార్‌ సీపీ తరఫున రంగంలోకి దిగిన మేయర్‌ అభ్యర్థిఽ కుప్పం ప్రసాద్‌ మొదటి రోజు నుంచి ప్రణాళిక ప్రకారం ప్రచారాన్ని చేపట్టారు. కార్పొరేటర్‌ అభ్యర్థులతో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకొంటున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ ముఖ్యనేతలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, శ్యామల తదితరులు నగరంలో విస్తృతంగా పర్యటించి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేశారు. దీంతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు, పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వెంకటేశ్వరరావు వెన్నంటి ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. మొత్తం మీద ఒంగోలు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చేస్తున్న ప్రచారానికి జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ప్రచారంలో ఆపసోపాలు..

కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన నల్లమల్లి శిల్ప ప్రచారంలో ఆపసోపాలు పడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా టీడీపీ ప్రధాన మిత్రపక్షంగా ఉన్న జనసేనలు నగరంలో 19 డివిజన్లలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల పర్వం ముగిసినా ఆయా డివిజన్లల్లో ఇరుపార్టీల అభ్యర్థులు ఎన్నికల రంగంలో నిలిచారు. దీంతో కూటమి పార్టీ కేడర్‌ అయోమయంలో పడిపోయింది. సొంత పార్టీలో ఉన్న వ్యతిరేకత, జనసేన నేతలు సైతం కలిసికట్టుగా పనిచేయక పోవడం, టీడీపీ అభ్యర్థికి ఇబ్బందిగా మారింది. ఆలస్యంగా మేల్కొన్న కూటమి పార్టీ పెద్దలు హడావుడిగా పత్రికా సమావేశం నిర్వహించి జనసేనకు ఆరు డివిజన్లు ఇస్తున్నామని టీడీపీ ప్రకటించింది. మిగిలిన 13 డివిజన్లలో కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని ప్రకటించడంతో మూడు పార్టీల నాయకులు, కేడర్‌ గందరగోళంలో పడిపోయారు. ఇది టీడీపీ అభ్యర్థికి తలనొప్పిగా మారింది. పై నుంచి అధిష్టానం చెప్పినా క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పురాలేదు. వీటికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడు అవ్వడంతో, టీడీపీ అభ్యర్థికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రచారంలో టీడీపీ అభ్యర్థికి జనం నుంచి స్పందన కనిపించడంలేదు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో జనసేనలపై బలప్రయోగానికి టీడీపీ సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే పోలీసులను రంగంలోకి దించాలని టీడీపీ నేతలు యత్నిస్తున్నారని కూటమి నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు.

చీమకుర్తిలో ఉధృతంగా ప్రచారం..

చీమకుర్తి మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి తన దైన శైలిలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఆమెకు అండగా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, సీఈసీ మెంబరు బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అభ్యర్థి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి శిద్దా సుధాకర్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి నిద్రలేకుండా చేస్తోంది. చాలా మంది కలసిరాకపోవడంతో ప్రచారంలో ఆయన ఎదురీదక తప్పడం లేదు.

సమష్టిగా ముందుకు..

గిద్దలూరులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయన తోడుగా వైఎస్సార్‌సీపీ నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, పిడతల ప్రవీణ్‌కుమార్‌ రెడ్డితోపాటు పార్టీ నేతలు సమష్టిగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడిగా అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి జనాల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండంతో, ఇక్కడ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేననే భావన వ్యక్తమవుతోంది.

ఇక్కడ కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ జేవీ నారాయణ పోటీలో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ఆశించిన బలం లేకపోవడంతో టీడీపీనే నమ్ముకోవాల్సి వస్తోంది. దీనికి తోడు కూటమి నేతల్లో ఉన్న అనైక్యత తన పుట్టి ముంచుతుందనే ఆందోళనలో బీజేపీ అభ్యర్థి ఉన్నట్టు తెలుస్తోంది.

అద్దంకిలో పోటాపోటీగా

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వూడత్తు సురేష్‌, టీడీపీ అభ్యర్థి కాకాని అశోక్‌ పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి తరఫున బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను తమదైన శైలిలో ఆకట్టుకుంటూ ప్రచారంలో ముందుకుపోతున్నారు.

దూసుకుపోతున్న డాక్టర్‌..

మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి డాక్టర్‌ చప్పల్లి కనకదుర్గ ఇంటింటి ప్రచారంతో పాటు, ర్యాలీలు, సోషల్‌ మీడియా ఇలా అన్ని రకాల ప్లాట్‌ ఫారంలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకరెడ్డితో పాటు నాయకులంతా ఏకతాటిపై అభ్యర్థి గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తున్నారు. వైద్యురాలిగా ఆమె అందించిన సేవలు, వైఎస్సార్‌ సీపీ పట్ల ఉన్న ప్రజాదరణ ఆమెకు ప్లస్‌ పాయింట్లుగా నిలుస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి వక్కలగడ్డ మల్లిఖార్జునరావు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కూడా తోడుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మూడు పార్టీల నేతలు ఎవరికి వారు ప్రచారం చేసుకునిపోతున్నారు. ఎక్కడా సమన్వయం కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement