బేస్తవారిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని ఎంపీటీసీ స్థానాలన్నింటినీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్న పచ్చ నేతలు.. ఇప్పుడు గిద్దలూరు మున్సిపాలిటీలో పట్టునిలుపుకునేందుకు అత్యంత హేయమైన రిగ్గింగ్ అస్త్రాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన పురపాలక సమరాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాలతో ప్రహసనంగా మార్చేందుకు కూటమి నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాలరాస్తూ అధికార యంత్రాంగాన్ని తమ స్వప్రయోజనాల కోసం పావులుగా వాడుకుంటూ కుయుక్తులకు తెరతీశారు.
రిగ్గింగ్ సంకేతాలు షురూ..!
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 28 వార్డుల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం దక్కకపోవడంతో కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజల మద్దతు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం కావడంతో పోలింగ్ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకే రిగ్గింగ్ పూర్తి చేసుకోవాలని పథకం రచించారు. 12 గంటల్లోపే ఓట్లు వేసుకోండి.. ఆ తర్వాత అంతా రిగ్గింగ్ జరిగిపోతుందంటూ అధికారులు, కూటమి నేతలే ప్రజలకు చేరేలా బాహాటంగా ప్రచారం చేస్తుండటం వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. తాము రిగ్గింగ్ చేసుకుంటామని టీడీపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యా నిస్తుండటం పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
పోలీసుల సహకారంతో అరాచకానికి కుట్రలు...
క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని గమనించిన కూటమి నేతలు.. ఎలాగైనా వైఎస్సార్ సీపీ శ్రేణులను స్తంభింపజేయాలనే లక్ష్యంతో పోలీసు శాఖను రంగంలోకి దించారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, 28 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల గృహాల్లో నిత్యం అర్ధరాత్రులు తనిఖీల పేరుతో వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువతను, పార్టీ సానుభూతిపరులను ఫోన్లలో బెదిరించడమే కాకుండా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చోవడానికి సిద్ధమైన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కూర్చుంటే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతూ పచ్చచొక్కాలు తొడుక్కున్నట్లుగా ఖాకీలు వ్యవహరిస్తున్నారు.
గిద్దలూరు పురపోరులో
బరితెగించేందుకు పచ్చ ముఠా సన్నద్ధం
స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల ఆదేశాలతో
రిగ్గింగ్ చేసేందుకు పక్కా పన్నాగం
ఖాకీలను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ
శ్రేణులపై దౌర్జన్యాలు, తనిఖీల పేరిట వేధింపులు
ఓటమి భయంతో అధికారులను పావులుగా వాడుకుంటున్న కూటమి నేతలు
నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే
వీచేది ఫ్యాన్ గాలే..
ఈసీ, కలెక్టర్, ఎస్పీ తక్షణమే జోక్యం
చేసుకోవాలని ప్రజల డిమాండ్


