సీఎస్ పురం (పామూరు): ‘నా నామినేషన్ ఉపసంహరణ అంతా ఆర్వో సృష్టే.. నేను నా నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు.. దీనిపై పూర్తి విచారణ జరిపి నాకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని సీఎస్ పురం మండలంలోని పెదరాజుపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన జొన్నకోతల దివ్యభారతి కోరారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ రాజుపాలెం ఎంపీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరఫున తాను నామినేషన్ వేసేందుకు వెళ్తే.. టీడీపీ నాయకులు, పోలీసులు అడ్డుకున్నారన్నారు. మళ్లీ 22వ తేదీ వెళ్లి నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీ నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తికాగా, తన నామినేషన్ అనుమతించబడిందని ఆరోఓ ధ్రువీకరించారని తెలిపారు. అయితే, 26వ తేదీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తాను బీ ఫాం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఆర్‌ఓ లేకపోవడంతో 27వ తేదీ బీఫాం ఇవ్వడం జరిగిందన్నారు. కాగా, రాత్రికి తుదిజాబితాపై విచారణ చేస్తే.. జాబితా ఇంకా విడుదల చేయలేదని సమాచారం అందిందన్నారు. పలు పుకార్లు వస్తుండటంతో దీనిపై అనుమానం వచ్చి విషయాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై ఆర్‌ను సంప్రదించేందుకు యత్నించినా స్పందన లేదన్నారు. 28వ తేదీ ఉదయం కూడా జాబితా లేకపోవడంతో గవర్నర్, సీఈఓ, కలెక్టర్, అధికారులకు మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. అనంతరం ఆర్వో బయట ఎదురుకావడంతో మాట్లాడేందుకు యత్నించగా, కార్యాలయానికి రావాలన్నారని, ఆ మేరకు వెళ్లానని తెలిపారు. అక్కడ ఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ మీ నామినేషన్‌కు సంబంధించి ఉపసంహరణ పత్రాన్ని మీ మామ అందించాడని చెప్పారని, కానీ, తాను తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని తెలిపారు. తానుగానీ, తన ప్రతినిధులుగానీ ఉపసంహరించుకోలేదని, అలా తన నుంచి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. తన నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఆయన పేరు ఏమిటి, ఆయన సమర్పించిన గుర్తింపు పత్రాలేమిటి, తన తరఫున ఆయనకు ఆ అధికారం ఉందని ఆర్వోగా మీరు ఎలా నిర్ధారించారని తాను ప్రశ్నించినట్లు తెలిపారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరానన్నారు. అయితే, ఆర్‌ఓ మాత్రం టీడీపీ నాయకులతో మాట్లాడిస్తానని, వేచి ఉండాలని తనతో చెప్పారన్నారు.
ఆర్‌టీఐ దరఖాస్తు కూడా తీసుకోని ఆర్వో...
నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఉపసంహరణ పత్రం ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఎలా నిర్ధారించారనే దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని, అదేవిధంగా పలు విషయాలపై ధ్రువీకరణ ఇవ్వాలని కోరుతూ ఆర్‌టీఐ దరఖాస్తు అందించబోగా.. సదరు దరఖాస్తును ఆర్‌ఓ తీసుకోకుండా నిరాకరించారని అభ్యర్థి దివ్యభారతి తెలిపారు. దీంతో సదరు దరఖాస్తును స్వీడ్ పోస్టు ద్వారా పంపినట్లు చెప్పారు. ఈ విషయంపై ఆర్వోను వివరణ కోరేందుకు ఫోన్‌లో సాక్షి ప్రయత్నించగా ఆర్‌ఓ అందుబాటులోకి రాలేదు.
పెదరాజుపాలెం ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు సృష్టించిన వైనం
టీడీపీ నాయకులను పిలిపించి
మాట్లాడిస్తానన్న ఆర్వో..
పూర్తి విచారణ చేపట్టి న్యాయం
చేయాలంటున్న అభ్యర్థి జొన్నకోతల దివ్యభారతి


