ఒంగోలు టౌన్: మారిన జీవనశైలి ప్రభావంతో ఇటీవల కాలంలో 40 ఏళ్లలోపు వయసు కలిగిన యువతలో ఎక్కువగా పక్షవాతం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లక్షణాలు కనిపించిన గంటలోపే చికిత్స అందించాలని, కుటుంబ హిస్టరీ ఉన్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ కె.అనిల్ కుమార్ సూచించారు. నేడు ప్రపంచ స్ట్రోక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విషయాలను ఆయన వివరించారు... పక్షవాతం అనగానే వయసు ఎక్కువగా ఉన్న వారికి వచ్చే వ్యాధిగా సమాజంలో అపోహ ఉంది. ఇది కరెక్టు కాదు. ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనివలన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు ప్రభావితమవుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర ప్రత్యేక కారణాలు పక్షవాతానికి దారితీయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పక్షవాతానికి ఎక్కువగా సొంత వైద్యం చేసుకోవడం, నాటు మందులు వాడటం చేస్తుంటారు. కానీ, అది ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. స్ట్రోక్ లక్షణాలు కనిపించగానే నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడినా, మెదడు రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగినా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ అత్యవసరమైనవే.. మెదడుకు స్కానింగ్ చేయకుండా అందులో దేని వలన పక్షవాతం కనిపించిందో నిర్ధారించలేరు. కారణాన్ని బట్టి వైద్యం చేయాల్సి ఉంటుంది.
యువతలో లక్షణాలు కనిపించకుండానే...
చాలా మంది యువతలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే పక్షవాతం వస్తోంది. బీపీ నియంత్రణలో లేకపోవడం వలన మెదడు రక్తనాళాలకు హాని చేస్తోంది. షుగర్ వ్యాధి పెరగడం, కొలెస్ట్రాల్, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం, గుండె లయలో అసాధారణ మార్పులు వంటివి స్ట్రోక్‌కు కారణాలు. నవ్వినప్పుడు మొహం ఒకవైపునకు వాలిపోవడం, ఒక చేయి లేదా కాలు ఆకస్మికంగా బలహీనపడటం లేదా మొద్దుబారడం, మాటలు తడబడటం వంటి లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
40 ఏళ్లలోపు వయసు వారిలోనూ
పొంచి ఉన్న పక్షవాతం
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం అందించాలంటున్న డాక్టర్లు
నేడు ప్రపంచ స్ట్రోక్స్ దినోత్సవం


