మర్రిపూడి: బడ్డీ కొట్టు తాళాలను గుర్తుతెలియన వ్యక్తులు పగలగొట్టి అందులోని నగదును అపహరించుకుపోయిన సంఘటన మర్రిపూడిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక బస్టాండ్ సెంటర్‌లో శ్రీముత్యాలమ్మ పరమేశ్వరి ఆలయ పూజారి మోటుపల్లి యోగయ్య ఆలయ ఆవరణలో 20 ఏళ్లుగా బడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. రోజూలాగే మంగళవారం బడ్డీకొట్టు తెరిచి అందులోని సరుకులు అమ్ముకుని రాత్రి కాగానే తాళాలు వేసి భార్యాభర్తలిద్దరు ఇంటికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున బడ్డీకొట్టు తీసేందుకు యోగయ్యతో పాటు అతని భార్య ఆదిలక్ష్మి రాగా, రెండు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బంకులోని గల్లాపెట్టెలో చిల్లరతో కలిపి సుమారు రూ.3 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. పగిలిపోయిన సిమెంట్ రాయితో తాళాలు పగలగొట్టి నగదు అపహరించుకుపోయి గల్లాపెట్టెను బడ్డీకొట్టు కింద పడేశారు. ఆ మేరకు యోగయ్య, ఆదిలక్ష్మి దంపతులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒంగోలు సిటీ: బాపట్ల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిన్నగంజాంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి నిడ్‌జామ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2026 పోటీలు హోరాహోరీగా జరిగాయి. జూనియర్ విభాగంలో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ఒంగోలుకు చెందిన శిద్దా ఆరాధ్య పాల్గొని విశేష ప్రతిభ ప్రదర్శించారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, షార్ట్ బాల్, రన్నింగ్‌లో శిద్దా ఆరాధ్య అర్హత సాధించి విజేతగా నిలిచారు. ఈ మేరకు బాపట్ల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వాహకులు పోటీల్లో పాల్గొని అర్హత సాధించిన శిద్దా ఆరాధ్యను అభినందించి మెడల్ అందజేశారు.
లింగసముద్రం: జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మండలంలోని పెదపవని భళేరావ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు హెచ్‌ఎం టి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బత్తాల చాందినీ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన అండర్ – 17 రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ ఫుట్‌బాల్ పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ఆడి ప్రతిభ కనబరిచింది. తద్వారా డిసెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొననుంది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న చాందినీని హెచ్‌ఎంతో పాటు పీడీ సీహెచ్ వెంకటకృష్ట, ఉపాధ్యాయులు అభినందించారు.
● జేసీ కల్పనా కుమారి
నాగులుప్పలపాడు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అక్రమంగా నగదు తరలింపు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అడ్డుకోవాలని జేసీ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. నాగులుప్పలపాడులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం ఆమె పరిశీలించారు. అధికారులకు ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తనిఖీల గురించి సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పరిశీలనలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో ఆశాలత ఉన్నారు.


