సింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ప్రాథమిక హక్కులు కాలరాశారని, ఇందులో అధికారుల పాత్ర ప్రధానంగా ఉందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి స్వామి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో జరిగిన అరాచకాలపై స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులే లక్ష్యంగా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 84 ఎంపీటీసీ స్థానాల్లో 45 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేశారని, ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. మంత్రి స్వామి, టీడీపీ నాయకులు రాజ్యాంగశక్తులుగా ఉన్న చైర్మన్‌లు మూకుమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అడ్డదారిలో గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని ఎద్దేవా చేశారు. పొన్నలూరులో డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నా కూడా నామినేషన్ వేయలేకపోయామని, తీరా నామినేషన్ వేస్తే ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలలో కొన్ని కాగితాలు తొలగించి తిరస్కరించారని ఆరోపించారు. మర్రిపూడిలో ఎస్సై సుదర్శన్, ఆర్వో అధికార పార్టీ తొత్తులుగా వ్యహరించారని, ఇక్కడ ఏకంగా చిన్నచిన్న కారణాలు చూపి 9 నామినేషన్లు తిరస్కరించారని విమర్శించారు. ఎన్నికల క్షేత్రంలో పోరాడి ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామన్నారు. న్యాయవ్యవస్థ, ప్రజా వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మీద తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గంలో పౌరహక్కులను కాలరాశారని ఆరోపించారు. మర్రిపూడి నియోజకవర్గంలో టీడీపీ వారు వైఎస్సార్ సీపీ వారి పేరుతో తప్పుడు నామినేషన్ పత్రాలు వేశారని ఆరోపించారు. చిన్న చిన్న కారణాలతో నామినేషన్ పత్రాలు తిరస్కరించారని, చివరికి ఆర్డీఓ కోర్టులో అప్పీలుకు వెళితే 5 గంటలకు తీర్పు వివరాలు చెప్పాల్సిన అధికారులు.. రాత్రి 2 గంటల తర్వాత అన్నీ తిరస్కరించారని, ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని ఆదిమూలపు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని మండలాల్లో స్క్రూటినీ సమయంలో టీడీపీ వారి నామినేషన్ పత్రాల్లో తప్పులుంటే అభ్యర్థులను తీసుకొచ్చి మరీ నామినేషన్లు సరిచేసి ఆమోదించారని, అదే వైఎస్సార్ సీపీ వారికి మాత్రం చిన్న చిన్న కారణాలు చూపి తిరస్కరించారని విమర్శించారు. దేశంలో సర్ ప్రోగ్రాంపై ఓటు హక్కు కోసం పోరాడుతుంటే.. తమ నియోజకవర్గంలో ఓటు వేసే హక్కు లేదన్న పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఓటరు దేవుళ్లే శ్రీరామరక్ష అని, ఈ ఎన్నికల్లో మిగిలిన స్థానాల్లో అఖండ మెజారిటీతో గెలిచి తమ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జరిగిన అరాచకాలపై హైకోర్టు తలుపు తడతామని, ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే సమస్యే లేదని అన్నారు.
రాజ్యాంగ హక్కులను కాలరాసిన మంత్రి స్వామి...
కొండపి నియోజకవర్గంలో మంత్రి స్వామి రాజ్యాంగ హక్కులను కాలరాయడం బాధాకరమని ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజలే అతనికి బుద్ధి చెబుతారన్నారు. మర్రిపూడి, టంగుటూరు, కొండపి, పొన్నలూరు, జరుగుమల్లిలో నామినేషన్ల సమయంలో జరిగిన అరాచకాలను వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షులు ఇనకొల్లు సుబ్బారెడ్డి, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి, పిన్నిక శ్రీనివాసరావులు, ఎంపీపీ అభ్యర్థి యన్నాబత్తిన కార్తీక్‌లు కళ్లకు కట్టినట్లు వివరించారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అభ్యర్థులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో చెప్పారు. టీడీపీ గూండాలు ఏ విధంగా దాడులు చేశారో తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, షేక్ సుల్తాన్, షేక్ కరీం, యనమల మాధవి, నూకసాని ప్రసాద్, దాసరి శేషయ్య, మిరియం సుధాకర్, పాకనాటి సుబ్బారెడ్డి, షేక్ అల్లాభక్షు, గొల్లపోతు గోవర్దన్, చుక్కా కిరణ్‌కుమార్, పెరికాల సునీల్, సయ్యద్ ఆబిద్‌ఆలీ, తన్నీరు రామకృష్ణ, షేక్ ఇస్మాయిల్, రేమాండ్స్ రాజా, గాదంశెట్టి గుప్తా, సోమిశెట్టి సురేష్, షేక్ జిలానీ, షేక్ అల్లా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు
నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి స్వామి రాజీనామా చేయాలి
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూలపు
సురేష్ డిమాండ్


