ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సహాయ ఎన్నికల అధికారి, ఒంగోలు నగర కమిషనర్ వెంకట కృష్ణయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని 62 వార్డులకు సంబంధించి మొత్తం 1,92,873 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 92,228, మహిళా ఓటర్లు 1,00,591 మంది, 54 మంది ఇతర ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరి కోసం 224 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పదవికి 14 మంది అభ్యర్థులు, 62 వార్డులకు వివిధ రాజకీయ పార్టీల తరఫున 326 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 25, 57, 58 డివిజన్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయన్నారు. 323 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. వల్లూరు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రారంభిస్తామని, నవంబర్ 1వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రిని అదే ప్రాంగణంలో స్వీకరిస్తారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలోని మొదటి, రెండవ అంతస్తుల్లో స్ట్రాంగ్ రూంలు, ఓట్ల లెక్కింపు హాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 500 బ్యాలెట్ బాక్సులను రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలోని నిర్దేశిత స్ట్రాంగ్ రూములో పోలీసు భద్రత మధ్య భద్రపరిచామని, వాటిని పోలింగ్ కేంద్రాలకు తరలించే వరకు పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 22 రవాణా మార్గాలను గుర్తించి, 22 మంది రూట్ అధికారులను నియమించామని, వీరిని 6 జోనల్ అధికారులు సమన్వయం చేసుకుంటూ రవాణా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపుపై ఇప్పటికే 538 మంది ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. వీరిలో 180 మంది లెక్కింపు సూపర్‌వైజర్లు, సహాయకులు, 17 మంది రిటర్నింగ్ అధికారులు, 34 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారన్నారు. 27వ తేదీ నుంచి 29 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సౌకర్యం కల్పించామన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వినియోగం, ప్రచార వాహనాలు, వేదికలు, పందిళ్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు తదితర కార్యక్రమాలకు సంబంధిత పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ లేదా ఇతర శాఖల అనుమతులు అవసరమైన సందర్భాల్లో అభ్యర్థులు లేదా వారి అధీకృత ప్రతినిధులు ముందస్తు అనుమతి పొందాలన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్నికల సహాయ కేంద్రం పనిచేస్తుందని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ప్రజలకు, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సహాయం అందిస్తుందన్నారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ వివేకానంద నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ పెరుగు నగేష్, ఏసీపీ వివేకానంద్, ఎంఈ యేశయ్య ఉన్నారు.
మాట్లాడుతున్న
ఒంగోలు నగర కమిషనర్ వెంకట కృష్ణయ్య,
ఇతర మున్సిపల్
అధికారులు
మేయర్‌తో పాటు 59 మంది కార్పొరేటర్లకు ఎన్నికలు
వివరాలు వెల్లడించిన అదనపు ఎన్నికల
అధికారి, ఒంగోలు నరగ కమిషనర్ వెంకట
కృష్ణయ్య


