అద్దంకి: గండ్లకమ్మలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని అద్దంకి–దర్శి రహదారిలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా నాగేంద్ర(75) అనారోగ్యంతో బాధపడుతుంది. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై తాను ఈ రోగంతో బతకలేకపోతున్నానని విషయాన్ని కుమార్తెకు చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కంభం: పంటకాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..బస్టాండ్ వెనుక వైపు ఉన్న ఇరిగేషన్ కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శివక్రిష్ణారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని శరీరంపై చొక్కా లేదు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసుంటుందని, మృతుడు బస్టాండ్ పరిసరాల్లో మద్యం సేవిస్తూ తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.
మార్కాపురం: ఉమ్మడి ప్రకాశంజిల్లా స్థాయిలో నిర్వహించిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీల్లో జిమ్నాస్టిక్ విభాగంలో మార్కాపురం జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ జాహ్నవి, పీఈటీ రోహిణి తెలిపారు. అండర్ 14 విభాగంలో మణి, అమూల్య, అండర్ 17 విభాగంలో అనూష, మహేశ్వరి, శ్రీవిద్య ఎంపికై నట్లు తెలిపారు. వీరిని హెచ్‌ఎం శ్రీదేవి, ఇన్‌చార్జి విజయభారతి అభినందించారు.
కంభం: చైన్నెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంభం పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన సయ్యద్ ఉబేదుల్లా (19) చైన్నెలో బీటెక్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని కంభం తీసుకుచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు బయలుదేరి వెళ్లారు.


