కంభం: పంటకాల్వలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..బస్టాండ్ వెనుక వైపు ఉన్న ఇరిగేషన్ కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శివక్రిష్ణారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని శరీరంపై చొక్కా లేదు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయసుంటుందని, మృతుడు బస్టాండ్ పరిసరాల్లో మద్యం సేవిస్తూ తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.
మార్కాపురం టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం మతిస్థిమితం లేని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి యాచకునిగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బస్టాండ్లో ప్రయాణికులు కూర్చునే బల్లపై కూర్చొని ఉండగా ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బిచ్చగాడిని పంపే క్రమంలో హోంగార్డు చేతిలో ఉన్న లాఠీతో కొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఆ సమయంలో యాచకుడు స్పృహతప్పి పడిపోవడంతో వైద్యశాలకు తరలించారు. వైద్యశాలకు తరలించిన కొద్దిసేపటికి బిచ్చగాడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.


