బల్లికురవ:
పొలం వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన రైతును హతమార్చి బంగారు నగలు దోపిడీ చేసిన ఘటన బల్లికురవ మండలంలోని గొర్రెపాడు గ్రామ సమీపంలో పొలాల్లో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు (58) తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్రామం నుంచి వెలమవారిపాలెం వెళ్లే మట్టిరోడ్డులో తనకున్న పొలాన్ని చూసి వస్తానని భార్య సుజాతకు చెప్పాడు. సాయంత్రం తిరిగి ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు వెతుకులాడారు. పొలంలో తలకు తీవ్రగాయాలతో కిందపడి ఉండటంతో చికిత్స కోసం కొప్పెరపాడు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుని చేతికి ఉన్న నాలుగు ఉంగరాలు, మెడలో ఉన్న బంగారపు గొలుసు, సెల్‌ఫోన్ చోరీకి గురయ్యాయి. అవన్నీ సుమారు 10 సవర్ల వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బంగారు ఆభరణాల కోసమే వెంకటేశ్వర్లును దొంగలు హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని, మృతదేహాన్ని సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, ఎస్సై వై.నాగరాజు పరిశీలించారు. మృతునికి భార్య సుజాత, కుమారుడు. కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


