న్యూస్‌రీల్
దర్శి నగర పంచాయతీలో అంతులేని అవినీతి పాత స్తంభాలు వేసి కొత్తవాటిగా బిల్లులు డివైడర్లకు రంగేసి నిధులు మింగేశారు మొక్కల పేరుతో రూ.లక్షలు స్వాహా పూడిక తీతల పేరుతో గోల్‌మాల్ టీడీపీ ప్రచారం కోసం ప్రజాధనం ముక్కుపిండి వసూళ్లు చేసిన పన్నులు టీడీపీ నేతల జేబుల్లోకి అధికారం అడ్డుపెట్టి అడ్డగోలు దోపిడీ
నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మేము గ్రామ వలంటీర్లుగా ప్రజలకు సేవ చేస్తూ రూ.5 వేల గౌరవ వేతనం తీసుకుంటే విమర్శలు చేశారు. నేడు నేరుగా పార్టీ సేవల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించబోతున్నారు. నాడు ప్రజా సేవలు చేస్తే తప్పా? నేడు పార్టీ సేవల కోసం తీసుకుంటే రైటా? పార్టీ సేవల కోసం ప్రభుత్వం ప్రజల సొమ్ము ఖర్చు చేయడం ఏమిటి?
– మందా ఎర్ర కోటయ్య, సంతమాగులూరు మండలం, మక్కెనవారిపాలెం
నాడు మాకు గౌరవ వేతనం ఇచ్చి ప్రజా సేవ చేయిస్తే, నేడు ప్రజల సొమ్ము ఎవరికో ఇచ్చి మీ డప్పు కొట్టించుకోవాలని చూస్తున్నారు. అది ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా? నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న వలంటీర్లను మళ్లీ నియమిస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మోసగించింది.
– గుంజి అమర భూపతి, సంతమాగులూరు మండలం, మక్కెనవారిపాలెం
దర్శి నగర పంచాయతీలో అవినీతికి అంతేలేకుండా పోతోంది. పట్టణంలో మురుగు కాలువలు కూడా తీసిన పాపాన పోని పాలకులు అభివృద్ధి పేరుతో పెట్టిన ఖర్చు గోరంతైతే దోపిడీ చేసిన నిధులు కొండంతగా ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు వేసే దగ్గర నుంచి..డివైడర్లకు రంగులు, మొక్కలు నాటడం ఇలా..ప్రతి పనిలోనూ లక్షల రూపాయలు అధికార పార్టీ నేతలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దర్శిలో డివైడర్లపై ఎండిపోతున్న మొక్కలు
దర్శి గడియారం స్తంభం సెంటర్‌లో నీళ్లలో వెళ్తున్న వాహనాలు (ఫైల్)
అభివృద్ధి గోరంత...
దర్శి:
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో నగర పంచాయతీ చైర్మన్ పదవి టీడీపీ దక్కించుకుంది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నంతకాలం అవినీతికి చోటివ్వలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నగర పంచాయతీలో వారి అవినీతికి అంతే లేకుండా పోతోంది. నిధులు మింగేసి అభివృద్ధి పనులు మానేసి ఆదాయ వనరులు చూసుకుంటున్న నగరపంచాయతీ పై విచారణ చేపడితే రూ.కోట్లలో కుంభకోణాలు బయట పడటం ఖాయం.
పన్నులు పెంచి ముక్కు పిండి వసూళ్లు:
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నగర పంచాయతీలో పన్నులు అమాంతంగా పెంచేశారు. పన్నులు కట్టని వారికి ఫోన్‌చేసి, నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసి మరీ కోట్లాది రూపాయల పన్నులు వసూళ్లు చేశారు. ఆ పన్నుల్లో నగర పంచాయతీకి ఖర్చు పెట్టింది గోరంత అయితే పాలకులు జేబుల్లోకి వెళ్లింది కొండంత అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎటువంటి ఖర్చులు పెట్టకుండానే రూ.లక్షల్లో స్వాహా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
నిధులు దుర్వినియోగం:
అనధికారకంగా పార్టీ నేతల ప్రచారం కోసం రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో నగర పంచాయతీకి సంబంధం లేని టీడీపీ నేతల ఫొటోలతో బస్ షెల్టర్‌లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడం, శిలా ఫలకాల పై నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఇన్‌చార్జ్ ఫొటోలు వేసి వారి ప్రచార ఆర్భాటాలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేశారు.
కాలువల తీతల్లో రూ.50 లక్షలు స్వాహా:
గత ఏడాది కాలువల్లో పూడిక మురుగు తీయించాలనే పేరుతో పొక్లెయిన్‌లు పెట్టి మురుగు తీయించినట్లు రూ.50 లక్షలపైగా బిల్లుల చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ నగర పంచాయతీలో ఎక్కడా ప్రధాన కాలువల్లో తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. నగర పంచాయతీలో పనిచేసే వర్కర్ల ద్వారా అక్కడడక్కడా కాలువలు తీయించి.. పొక్లెయిన్‌లతో కాలువలు తీయించినట్లు బిల్లులు చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఇందులో రూ.50 లక్షల వరకు నగర పంచాయతీ నిధులు దింగమింగారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వర్షం కురిస్తే కాలువల్లో నీరుపోక గడియారం స్తంభం సెంటర్‌లో రోడ్లపైనే వర్షం నీరు నిలబడి జలమయమై ఉంటోంది.
ఆధునికీకరణ పేరుతో అంతులేని అవినీతి
నగర పంచాయతీలో ఆధునికీకరణ పేరుతో అంతులేని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటినట్లు బిల్లులు చేసుకున్నారు. వాటి నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో 70 శాతం వరకు మొక్కలు చనిపోయాయి. మొక్కల కొనుగోలులో రూ.2.50 లక్షల అవినీతి జరిగిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం ఉన్న మొక్కలు కూడా నిర్జీవంగా ఉన్నాయి. పాత డివైడర్లకు ప్లాస్టింగ్ చేసి, కూటమి పార్టీల రంగులు వేసుకున్నారు. కొత్త డివైడర్లు నిర్మించినట్లు బిల్లులు చేసుకుని రూ.లక్షల్లో దిగమింగారు. నాసిరకం రంగులు వేయడంతో ఆ రంగులన్నీ వెలిసిపోయాయి. ఈ డివైడర్లలో రూ.8 లక్షల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నగర పంచాయతీపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాలు అడిగిన వారికి సమాచారం ఇవ్వకుండా వారిపై సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


