ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం జిల్లాలో పెట్టుబడులకు ప్రోత్సాహకం కలెక్టర్ పి.రాజాబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రగతి మార్గంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పీ రాజాబాబు తెలిపారు. జిల్లాలో కలెక్టర్‌గా ఏడాదికిపైగా పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. కలెక్టర్ స్వయంగా గ్రామాల్లో రాత్రి బస చేసి ప్రజలతో నేరుగా మాట్లాడటం, గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అధికారులతో కలిసి గ్రామంలో సంక్షేమ, అభివృద్ధి పనులను పరిశీలించి లోపాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జల సురక్ష కార్యక్రమం ద్వారా ఒక నెల పాటూ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చెరువుల పూడిక తీత, ట్యాంకులను పరిశుభ్రపరచడం వంటి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించి ట్యాంకుల నుంచి సరఫరా అయ్యే నీరు తాగడానికి పనికి వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
వేస్టు టు వెల్త్..సర్క్యులర్ ఎకానమీ
పర్యావరణ పరిరక్షణతో పాటూ స్థానిక సంస్థలకు రాబడి సమకూర్చే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న 125 టన్నుల వ్యర్థాల్లో తడి చెత్తను బయోవిజార్డ్ అనే మైక్రోబియల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంపోస్టుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ కంపోస్టును ‘గ్రీన్ గోల్డ్’ అనే పేరుతో బ్రాండింగ్ చేసి కిలో రూ.10ల చొప్పున విక్రయిస్తున్నట్లు, దీంతో నెలకు రూ.2.5 లక్షల వరకూ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదాయ చేకూరుతుందని చెప్పారు. ఈ కంపోస్టుకు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్, ఆగ్‌మార్క్ పొందినట్లు వివరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామస్థాయిలో రెవెన్యూ గ్రామసభలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పీజీఆర్‌ఎస్, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక పీజీఆర్‌ఎస్, పల్లె వీక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే అధికారులు వెళ్లే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
● సర్–2026లో 2002, 2026 ఓటర్ల వివరాలను పోల్చి, క్రాస్ చెక్ చేసే వోటర్ మ్యాపింగ్ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి గాను బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును–2025 సంవత్సరానికి ఎన్నికల సంఘం ప్రకటించినట్లు చెప్పారు.
● ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు బిజినెస్ ఎలైట్ మీట్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారిక ‘ఇన్‌వెస్ట్ ఇన్ ప్రకాశం’ వేదికలో పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
● మన గౌరవం మన నినాదం పేరుతో ఒంగోలు నగర పాలక సంస్థ 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. భారతీ సేవా, పారిశుద్ధ్య, అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 150 రోజుల పాటూ ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రతి వార్డులో నిర్వహిస్తున్నామని చెప్పారు.


