ఒంగోలువన్‌టౌన్: డప్పు కళాకారులు, చర్మ కళాకారులకు 40 ఏళ్లకే పెన్షన్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మాదిగ డప్పు కళాకారులకి చర్మ, కళాకారులకు పెన్షన్‌లను అందిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని బీజేపీ నాయకులు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో గతంలో ప్రకటించారని, అయినా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పంచాయతీకి ఒక డప్పు కళాకారుడికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. 40 ఏళ్లు నిండిన డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఇల్లు లేని వారికి, ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. రూ.2 లక్షల స్వయం ఉపాధి రుణాలను ఎటువంటి హామీ లేకుండా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో కొలకలూరి రవి, ఎల్ జోసెఫ్, పాటిబండ్ల గంగయ్య, లింగయ్య, ఇశ్రాయేలు, గుంటూరు ప్రసాద్, గుంటూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


