భయాందోళన సృష్టిస్తున్న నేషనల్‌ హైవే | - | Sakshi
Sakshi News home page

భయాందోళన సృష్టిస్తున్న నేషనల్‌ హైవే

Sep 24 2026 2:42 AM | Updated on Sep 24 2026 2:42 AM

భయాందోళన సృష్టిస్తున్న నేషనల్‌ హైవే

● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: నేషనల్‌ హైవేలపై జరుగుతున్న ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, నియోజకవర్గంలో ఏదో ఒక హైవేపై ప్రమాదాలు జరగడం, ప్రాణాలు కోల్పోవడం విచారకమని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి సమీపంలోని హైవేపై జరిగిన ప్రమాదంలో సోమేపల్లికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఆయన వారి గ్రామానికి వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యపేటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గురిజేపల్లికి చెందిన గోన దావీదు మృతి చెందాడు. మృతదేహానికి బుధవారం ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెద్దదోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం మండలాల మీదుగా వేసిన జాతీయ రహదారి డిజైన్‌ సక్రమంగా లేదని, రద్దిగా ఉండే గ్రామాల మధ్య నుంచి రహదారులు ఉండటంతో నిత్యం ప్రజలు ప్రమాదాల బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణపాయస్థితి నుంచి బయటపడి గాయాలపాలైన క్షతగాత్రులు సకాలంలో వైద్యం చేయించుకునేందుకు దరిదాపులో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలలు అందుబాటులో లేవని, సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునేలోపు అనేక మంది మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న జాతీయ రహదారుల నుంచే శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారని, వారు కూడా అనేక పర్యాయాలు ప్రమాదాల బారిన పడి వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దదోర్నాలలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను నెలకోల్పేందుకు నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయించారని, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ వైద్యశాలను మరుగున పడేసిందని, క్షతగాత్రులను రక్షించే చర్యలు తీసుకోకపోగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందించే రూ.5 లక్షలు నిలిపేసి శవరాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పచ్చ కార్డు ఉన్నవారికే కూటమి ప్రభుత్వం డబ్బు అందచేస్తోందని, తన సొంత ఆస్తి ఇచ్చినట్లు శవాలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం చేయడం హేయమైన చర్యన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సోమేపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, ప్రసాద్‌, గురిజేపల్లికి చెందిన దావీదులు దళిత వర్గాలకు చెందిన వారని, పేద కుటుంబాలని, ఆ కుటుంబాల పెద్దలు మృతి చెందడంతో వారి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మిగిలిందని, వెంటనే స్పందించి వారిని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి సుబ్బమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, ఫిలిఫ్‌, షేక్‌ మహ్మద్‌ కాశిం, షేక్‌ వలి, కె.సత్యనారాయణ చౌదరి, జి.రామిరెడ్డి, కె.కాశిరెడ్డి, కె.కోటిరెడ్డి, వి.బాలయోగిరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement