యువకులు గల్లంతైంది ఈ నీటి ప్రవాహ ఉధృతిలోనే..
పెద్దదోర్నాల: పచ్చని నల్లమల కొండల నడుమ నిండుకుండలా జలాశయం.. శ్రీశైలం నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలు.. చూసేందుకు ఎంతో కనువిందుగా ఉన్న ఆ ప్రకృతి సోయగాల వెనుక పెను ప్రమాదం పొంచి ఉందని ఆ యువకులు ఊహించలేకపోయారు. ప్రాజెక్టు మొదలై పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఆ కాలువ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. వారిలో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు కొట్టుకుపోయిన వైనం కటకానిపల్లె గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రవాహ వేగం అంచనా వేయలేక..
గత ఆగస్టు 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం నుంచి నీరు విడుదల చేశారు. నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు 10.70 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో శ్రీశైలం నుంచి నిత్యం 5 వేల క్యూసెక్కుల నీరు ఫీడర్ కెనాల్ ద్వారా రిజర్వాయర్‌కు చేరుతోంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5వ తేదీన కటకానిపల్లెకు చెందిన రాజ్‌కుమార్, వినయ్‌కుమార్ సరదాగా ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లారు. నీటి ప్రవాహ ఉధృతిని ఏమాత్రం అంచనా వేయలేక లోపలికి దిగి క్షణాల్లోనే కొట్టుకుపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లింట శోకసంద్రం
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన 32 మంది ఎస్డీఆర్‌ఎఫ్ దళాలు, రెవెన్యూ, పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 6న వినయ్‌కుమార్ మృతదేహం లభ్యం కాగా, రాజ్‌కుమార్ జాడ నేటికీ కానరాలేదు. గల్లంతైన రెండో రోజు అంటే.. సెప్టెంబర్ 7వ తేదీనే రాజ్‌కుమార్ వివాహం జరగాల్సి ఉండటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. బాజాభజంత్రీలతో కళకళలాడాల్సిన ఇంట పెను విషాదం అలుముకుంది. ఘటన జరిగి 12 రోజులు గడుస్తున్నా కొడుకు మృతదేహం కూడా దక్కకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఆంక్షలు కట్టుదిట్టం!
ఈ ఘోర ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫీడర్ కెనాల్ వద్ద పర్యాటకులు ఎవరూ నీటిలోకి దిగకుండా నిషేధం విధించారు. ప్రమాదకర ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేసి, కాలువ వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. సరదా కోసం, సెల్ఫీలు తీసుకునేందుకు నీటిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో కటకానిపల్లె యువకులు ఇద్దరు గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం.. 12 రోజులైనా కానరాని మరో యువకుడి ఆచూకీ
రాజ్‌కుమార్ కోసం నేటికీ గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది


