పొదిలి: దర్శి రోడ్డులో గుర్తుతెలియని ఆటో ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. దర్శికి చెందిన గుండు యోగయ్య(65) బుధవారం తన పనుల నిమిత్తం గోవిందు అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పొదిలి వచ్చారు. పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ సమీపానికి చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యోగయ్యతో పాటు గాయపడిన గోవిందును 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యోగయ్య మృతి చెందినట్లు బంధువులు, పోలీసులు తెలిపారు.
ఒంగోలు టౌన్: మద్యానికి బానిసైన ఒక యువకుడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోకి దూకి ఆత్యహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని ప్రగతి కాలనీకి చెందిన యద్దనపూడి చందు (21) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. మద్యానికి అలవాటు పడిన చందు మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను. మోటార్ బైకు మామిడిపాలెం చెరువు గట్టు మీద ఉంది తీసుకెళ్లండని చెప్పాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు చెరువు వద్ద మోటార్ బైకు లభించింది. రాత్రి కావడంతో గాలింపు చ ర్యలు చేపట్టలేకపోయారు. బుధవారం సాయం త్రం 4 గంటలకు చందు మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. తాలుకా ఎస్సై ఫిరోజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అద్దంకి రూరల్: భార్యాభర్తల విడాకుల నేపథ్యంలో కూతురిని తండ్రి వద్దే ఉండాలని బంధువులు ఒత్తిడి చేసి బాలికపై దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం అద్దంకిలో పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. జె.పంగులూరు మండలంలోని నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు, వారి బంధువులు విడాకుల కేసులో అద్దంకి కోర్టులో హాజరయ్యేందుకు కారులో వచ్చారు. తండ్రి వద్దకు రావాలని బాలికను ఒత్తిడి చేయగా..ఆ బాలిక రానని చెప్పడంతో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కారు ఆపి బాలికకు బంధువులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు అడ్డుకొని బాలికను మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


