కంభం: వెలిగొండ ప్రాజెక్టు అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని జంగంగుంట్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వినాయకచవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కేపీ నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబుతో కలిసి తాటిపర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంట లేకుండా వంట వండిన చంద్రబాబుకు కాల్వలు తవ్వకుండా వెలిగొండ ప్రాజెక్టులో నీళ్లొదలడం పెద్ద కష్టమా అని ఎద్దేవా చేశారు. ఒక్క ఎకరానికి నీల్లొచ్చే కాలువ ఉందా, ఒక్క మనిషి తాగడానికి నీళ్లొచ్చే ట్యాంకు ఉందా అని ప్రశ్నించారు. 10 టీఎంసీల టెస్ట్ స్టోరేజీ అని తెలిసినా వెలిగొండ ప్రాజెక్టులో నీళ్లొదిలి ప్రజలను మోసం, దగా చేస్తున్నారన్నారు. వెలిగొండ అంటే గుర్తొచ్చే రాజశేఖరరెడ్డి అని 1960లో వెలిగొండ ప్రాజెక్టు ఆలోచనా, ఆశలు చిగురించాయని, పోరాటాలు అయ్యాయని ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేదని కానీ చంద్రబాబు మాత్రం నేను శంకుస్థాపన చేసా నేను ప్రారంభోత్సవం చేశానని చెబుతున్నారని, ఆయన చేసిన శంకుస్థాపన శిలాఫలకాల చుట్టూ అడవులు మొలిశాయన్నారు. కుప్పానికి కూడా నీళ్లిచ్చికోలేని, కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేని దుస్థితిలో ఆయన ఉన్నారని ఎద్దేవా చేశారు. సొంతూరు నారావారిపల్లి ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో గెలవలేక చంద్రబాబు, ఆయన కొడుకు పక్క జిల్లాల్లో, పక్క నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ‘ఇంట గెలవలేవు నువ్వు రచ్చ గెలుస్తావా జగన్‌మోహన్ రెడ్డితో అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చేసిందన్నారు. మార్కాపురం జిల్లా చేశారని గొప్పగా చెప్పుకుంటున్నారని కొత్త జిల్లాలో ఒక్క వ్యవస్థను తెచ్చారా, ఒక్క సంస్థను కానీ, ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క ఆడబిడ్డ నిధిని ఇచ్చారా అని కూటమి నేతలను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చింది శూన్యం, తెచ్చింది శూన్యమని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టులో అగ్రభాగం పనులు వైఎస్సార్, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేశారని, అరకొర పనులు చేసిన చంద్రబాబు మొత్తం ఆయన చేసినట్లే గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. జంగంగుంట్ల గ్రామంలో వైఎస్సార్ సీపీకి తిరుగులేదని, ఇక్కడి ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తూనే ఉంటారన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్


