దర్శి: గ్రామాల్లో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వినాయకచవితి వేడుకల సందర్భంగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్‌లో ఎటువంటి పోలీస్ అనుమతులు లేకుండా డీజే సౌండ్‌లతో డ్యాన్సర్లను తీసుకువచ్చారు. టీడీపీ నేత వేముల వెంగళరత్తయ్య ఆధ్వర్యంతో డీజే బాక్స్‌ల్లో పెద్ద పెద్ద సౌండ్‌లతో పాటలు పెట్టి డ్యాన్సర్‌లతో నృత్యాలు చేయించారు. డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారని తెలుసుకున్న స్థానిక యువకులు అక్కడకు చేరుకున్నారు. డ్యాన్స్ కార్యక్రమాన్ని వీడియోలు తీశారు. దీంతో వీడియోలు తీసిన దేవండ్ల వినోద్, బండారు తిరుపతి అనే యువకుల వద్దకు వచ్చి వీడియోలు డీలిట్ చేయాలని బెదిరించడంతో వారు వెంటనే ఫోన్ల నుంచి ఆ వీడియోలు డీలిట్ చేసి వెనుదిరిగారు. కొంత దూరం వెళ్లిన తరువాత వారిని వెనక్కి పిలిచి వీడియోలు ఎందుకు తీశారని టీడీపీ నేతలు ఆ ఇద్దరిని చుట్టుముట్టి చితకబాదారు. వారి సెల్‌ఫోన్ తీసుకొని వినోద్ మెడలో ఉన్న చైన్ కూడా లాగేసుకున్నారు. గొడవ జరుగుతుందని తెలుసుకున్న వారి బంధువులు, స్థానికులు అక్కడకు వెళ్లగా వారిపై కూడా గొడవకు దిగారు. మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు వినోద్, తిరుపతిలను తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రాత్రి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కానిస్టేబుల్ అక్కడకు వచ్చి గొడవ పడుతున్న వారిని సర్దిచెప్పారు. డీజేలకు అనుమతి లేకున్నా ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్థానికులపై దాడి చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
వినాయకచవితి వేడుకల్లో పోలీసుల అనుమతి లేకుండానే డీజేతో మహిళలతో అసభ్య డాన్స్‌లు
వీడియోలు తీశారని ఇద్దరు యువకులపై దాడి
యువకుడి గోల్డ్ చైన్ లాగేసుకుని చితకబాదిన వైనం
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు


