శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 12 2026 2:54 AM | Updated on Sep 12 2026 2:54 AM

శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 – 8లో..

ఎన్నికల నగారా మోగకముందే కూటమిలో రగిలిన కుంపటి ఒంగోలు మేయర్‌ పీఠం కోసం టీడీపీ–జనసేన ఆధిపత్య పోరు ‘బాలినేని–దామచర్ల’ పరస్పర విమర్శలతో రచ్చకెక్కిన విభేదాలు 62 డివిజన్లలో రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు జనసేన సన్నాహాలు ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణాల్లో ‘రాజీ’ లేని రచ్చ సమష్టి వ్యూహంతో ‘స్థానిక’ సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల నగారా ఇంకా మోగకముందే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూటమి పార్టీల్లో అసమ్మతి కుంపట్లు భగ్గుమంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే సీట్ల పంపకాలు, స్థానిక ఆధిపత్య పోరుతో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతలు పరస్పరం కత్తులు నూరుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు కలిసి తిరిగిన నాయకులు.. ఇప్పుడు తమ రాజకీయ ఉనికిని, క్షేత్రస్థాయి బలాన్ని నిరూపించుకునేందుకు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్‌ పీఠం ఎవరికి దక్కాలనే అంశంపై ఇరు పార్టీల మధ్య రగిలిన చిచ్చు చినికి చినికి గాలివానలా మారుతోంది. వేర్వేరుగా అభ్యర్థులను సిద్ధం చేసుకుంటూ బలప్రదర్శనకు దిగుతుండటంతో కూటమిలో విభేదాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఒకవైపు కూటమిలో కుర్చీలాట రచ్చకెక్కుతుంటే.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ మాత్రం సమష్టి వ్యూహంతో శ్రేణులను ఏకతాటిపైకి తెస్తూ స్థానిక సమరానికి సర్వసన్నద్ధమవుతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

మ్మడి జిల్లా పరిధిలో ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు మార్కాపురం, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి, పొదిలి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలో కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు ఇప్పటికే వీధిన పడ్డాయి. జనసేన ముఖ్య నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ గత కొద్దికాలంగా పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు కూటమిలోని లుకలుకలను బజారున పడేశాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు అవినీతి అస్త్రాలు సంధించుకోవడంతో పార్టీల పరువు గంగపాలైంది. దీంతో కూటమి అధిష్టానం జోక్యం చేసుకుని నేతలెవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పైకి ఆదేశించినప్పటికీ, తెరవెనుక మాత్రం వివాదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఇటీవల మంత్రి నారా లోకేష్‌ జిల్లా పర్యటనలో ‘‘దామచర్ల సైలెంట్‌గా ఉంటాడు.. ఆయన జోలికి వస్తే దబిడిదిబిడే’’ అంటూ చేసిన వ్యాఖ్యలు మిత్రపక్ష జనసేనను రెచ్చగొట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధిష్టానమే కయ్యానికి కాలుదువ్వేలా ప్రోత్సహిస్తోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికితోడు స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల కూర్పుపై జనసేనలోనే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక వర్గానికి పెద్దపీట వేసి, మరో వర్గాన్ని విస్మరించారన్న అసంతృప్తితో సొంత పార్టీలోనే నేతలు రగిలిపోతున్నారు.

ఒంగోలు మేయర్‌ పీఠంపై పేచీ..

ఒంగోలు కార్పొరేషన్‌ పీఠాన్ని దక్కించుకోవడమే ఇప్పుడు కూటమిలో పెను వివాదంగా మారింది. నగరంలో తమకు తిరుగులేని కేడర్‌ బలం ఉందని చెబుతున్న జనసేన పార్టీ.. మేయర్‌ స్థానాన్ని తమకే కేటాయించాలని గట్టిగా పట్టుబడుతోంది. పార్టీ బలంగా ఉన్న చోట్లే పోటీ చేస్తామని అధినేత ప్రకటించిన నేపథ్యంలో ఒంగోలు పీఠంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం నగరపాలక సంస్థను మిత్రపక్షానికి ఇచ్చే ప్రసక్తే లేదన్న ధీమాతో పావులు కదుపుతోంది. నగరంలోని మొత్తం 62 డివిజన్లలో జనసేనకు అతి తక్కువ సీట్లు విదిల్చి చేతులు దులుపుకోవాలని టీడీపీ యోచిస్తోంది. టీడీపీ ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన జనసేన శ్రేణులు.. అన్ని డివిజన్లలోనూ సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పథక రచన చేశారు. పొత్తు కుదరకపోతే స్వతంత్రులుగా, రెబల్స్‌గానైనా బరిలో నిలవాలని స్థానిక క్యాడర్‌కు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. ఒంగోలుతో పాటు గిద్దలూరు, దర్శి మున్సిపాలిటీల్లోనూ సీట్ల సర్దుబాటు తీవ్ర వివాదాస్పదంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

స్థానికంలో..

సీటు మార్‌!

సమష్టి వ్యూహంతో కదం తొక్కుతున్న వైఎస్సార్‌ సీపీ

కూటమి పక్షాలు కుర్చీల కొట్లాటలో మునిగి తేలుతుండగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ యంత్రాంగం ఇప్పటికే సమరశంఖం పూరించింది. నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నేతలు, బూత్‌ స్థాయి కార్యకర్తలతో వరుసగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. శ్రేణులను ఏకతాటిపైకి తెస్తూ.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూనే ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల్లో విజయదుందుభి మోగించడమే లక్ష్యంగా నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. కూటమిలో స్వార్థపూరిత ఆధిపత్య పోరు ప్రజల ముందు నవ్వులపాలవుతుంటే.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైనికుల్లా కదం తొక్కుతుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement