పింఛన్లకు పచ్చ ముద్ర! | - | Sakshi
Sakshi News home page

పింఛన్లకు పచ్చ ముద్ర!

Sep 12 2026 2:54 AM | Updated on Sep 12 2026 2:54 AM

● టీడీపీ మద్దతుదారుల దరఖాస్తులకే తొలి ప్రాధాన్యం ● సామాన్యుల అర్జీలు నిర్ధాక్షిణ్యంగా బుట్టదాఖలు ● ఓటేస్తేనే పింఛనంటూ లబ్ధిదారులకు ‘పచ్చ’ నేతల బెదిరింపులు

● టీడీపీ మద్దతుదారుల దరఖాస్తులకే తొలి ప్రాధాన్యం ● సామాన్యుల అర్జీలు నిర్ధాక్షిణ్యంగా బుట్టదాఖలు ● ఓటేస్తేనే పింఛనంటూ లబ్ధిదారులకు ‘పచ్చ’ నేతల బెదిరింపులు

దర్శి: కూటమి ప్రభుత్వంలో అధికారుల పచ్చపాతం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పాలిట శాపంగా మారుతోంది. అర్హతతో సంబంధం లేకుండా.. టీడీపీ కండువా కప్పుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ సచివాలయ సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను సైతం రద్దు చేయడంతో నిరుపేదలు కాళ్లరిగేలా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్నట్లు పచ్చ నేతలు ఫొటోలకు ఫోజులివ్వడం పరిపాటిగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం మళ్లీ కొత్త పింఛన్ల దరఖాస్తులంటూ లబ్ధిదారుల్లో ఆశలు రేపిన కూటమి పాలకులు.. క్షేత్రస్థాయిలో తీవ్ర వివక్ష చూపుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కో సచివాలయం పరిధిలో 100 నుంచి 200 వరకు దరఖాస్తులు నమోదైనట్లు తెలుస్తోంది.

అర్హత ఉన్నా అడుక్కోవాలా?

దర్శి మండల ఎంపీడీఓ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు సిబ్బంది కేవలం టీడీపీ సానుభూతిపరుల దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజల అర్జీలను పక్కన పడేస్తున్నారు. తమ దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయాలని నిలదీస్తున్న లబ్ధిదారులకు.. గ్రామంలోని టీడీపీ నేతలతో చెప్పిస్తేనే పని జరుగుతుందని కొందరు సిబ్బంది తెగేసి చెబుతున్నారు. గతి లేక పచ్చ నేతల వద్దకు వెళ్తే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే ఓటు వేస్తామని హామీ ఇస్తేనే పని చేస్తామంటూ నిర్లజ్జగా బేరసారాలకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌ నమోదుకు ఓటీపీ తప్పనిసరి కాగా, అమాయక లబ్ధిదారుల నుంచి కాగితాలు తీసుకుని ‘తర్వాత ఫోన్‌ చేసి ఓటీపీ అడుగుతాం’ అని చెప్పి వారిని మభ్యపెడుతూ అర్జీలను బుట్టదాఖలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పచ్చ దగాపై దర్శి ఎంపీడీఓను వివరణ కోరగా.. తాను ఎవరికీ అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతూ వెంటనే ఫోన్‌ కట్‌ చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement