పీఎల్‌ఐలో వివక్ష వీడకుంటే నిరవధిక సమ్మె | - | Sakshi
Sakshi News home page

పీఎల్‌ఐలో వివక్ష వీడకుంటే నిరవధిక సమ్మె

Sep 12 2026 2:54 AM | Updated on Sep 12 2026 2:54 AM

బెంగళూరులో ‘లోక్‌ సంవర్ధన్‌’ ప్రదర్శన ● దరఖాస్తులకు ఈ నెల 13వ తేదీ తుది గడువు ● మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఈడీ ఫైజుద్దీన్‌ వెల్లడి

ఐదు రోజుల బ్యాంకింగ్‌ను వెంటనే చట్టబద్ధం చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ రాజీవ్‌ రతన్‌ దేవ్‌ ధ్వజం సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తామని స్పష్టీకరణ ఒంగోలు మహాధర్నాలో కదంతొక్కిన బ్యాంకింగ్‌ సిబ్బంది

ఒంగోలు వన్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న 7వ ‘లోక్‌ సంవర్ధన్‌’ ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) ఎస్‌.కె. ఫైజుద్దీన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన ఆసక్తి గల హస్తకళాకారులు, వంట నిపుణులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఎంపికై న లబ్ధిదారులకు కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం టీఏ, డీఏతో పాటు ప్రత్యక్ష ప్రదర్శన కోసం అయ్యే ముడిసరుకుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఒక్కో కళాకారుడికి, స్టాల్‌ సహాయకునికి రోజువారీ భత్యం కింద రూ.1,000 చొప్పున, అలాగే ప్రదర్శన ముడిపదార్థాల ఖర్చుల నిమిత్తం రోజుకు గరిష్టంగా రూ.1,500 వరకు చెల్లిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్నవారు తమ నామినేషన్లను ఈ నెల 13వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివరాలకు ఒంగోలు సంతపేటలోని స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో లేదా 9849901157ను సంప్రదించాలని ఈడీ ఫైజుద్దీన్‌ సూచించారు.

ఒంగోలు సబర్బన్‌: ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇప్పటికే ఆమోదించి సిఫారసు చేసిన ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చట్టబద్ధంగా అమలు చేయాలని జాతీయ బ్యాంకుల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్‌ రాజీవ్‌ రతన్‌ దేవ్‌ డిమాండ్‌ చేశారు. పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ అలవెన్స్‌ (పీఎల్‌ఐ) అమలులో నెలకొన్న అక్రమాలు, తీవ్ర అసమానతలు, ఉద్యోగుల మధ్య పక్షపాత ధోరణిని కేంద్రం తక్షణమే తొలగించాలన్నారు. బ్యాంకింగ్‌ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేపట్టి, ఆపై నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన హెచ్చరించారు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నగరంలో బ్యాంకర్లు భారీ ధర్నా నిర్వహించారు. నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లోని యూనియన్‌ బ్యాంకు ఎదుట ఏడు యూనియన్ల ఉద్యోగులు, అధికారులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం నెల్లూరు బస్టాండ్‌ సెంటర్‌లోని మున్సిపల్‌ ఓపెన్‌ ఆడిటోరియం ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెట్టే క్రమంలోనే కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని యూనియన్‌ నేతలు నిప్పులు చెరిగారు.

సీనియర్‌ నాయకుడు రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ.. బ్యాంకుల్లో తీవ్రమైన సిబ్బంది కొరత, విపరీతమైన వ్యాపార లక్ష్యాలు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఒత్తిడితో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగులు యంత్రాలు కాదని, ఆధునిక బ్యాంకింగ్‌కు ఆధునిక పని విధానం అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో పెరిగిన తీవ్ర పని ఒత్తిడి భరించలేక గత దశాబ్ద కాలంలో 500 మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. అందుకే ఇకపై తాము సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తామని యాజమాన్యాలకు ఇప్పటికే తేల్చిచెప్పామన్నారు. సాంకేతికత విస్తరించిన ప్రస్తుత తరుణంలో ఐదు రోజుల పనిదినాల అమలును ఇక ఏమాత్రం వాయిదా వేయలేరని, ఉద్యోగులకు కుటుంబ సమయం, సరైన విశ్రాంతి లభిస్తేనే పనితీరు మెరుగవుతుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసేది అందరూ అయితే, పీఎల్‌ఐ ప్రయోజనాల్లో మాత్రం వివక్ష ఎందుకని నిలదీశారు.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 50 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో బ్యాంకుల్లో 2 లక్షలు, రైల్వేలో 4 లక్షల ఖాళీలు ఉన్నాయని నేతలు గుర్తుచేశారు. 1969, 1980లలో బ్యాంకుల జాతీయకరణ సమయంలో కేవలం రూ.50 వేల కోట్లుగా ఉన్న డిపాజిట్లు.. నేడు ఉద్యోగుల శ్రమతో రూ.146 లక్షల కోట్లకు చేరి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయన్నారు. పని చేసిన వారికి జీతాలిచ్చాం.. ఇక పెన్షన్లు ఎందుకనే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. గతంలో సీపీఎస్‌ రద్దుపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును, ప్రభుత్వాల పెన్షన్ల వ్యతిరేక నాటకాలను తీవ్రంగా ఆక్షేపించారు. ఐక్యతే మన బలం.. న్యాయం సాధించే వరకు పోరాటమే మన మార్గం అని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వి. శ్రీనివాస్‌, సుబ్బారావు, ఉమా శంకర్‌, రవి ప్రకాష్‌, బ్రహ్మనాయుడు, కిషోర్‌ రెడ్డి, ఎస్‌.కె. హసన్‌తో పాటు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement