రైతులను పట్టించుకోని బాబు సర్కార్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఆగ్రహం ఎకరాకు రూ.50 వేల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్
యర్రగొండపాలెం: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తుంటే.. అన్నదాతలను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర సమితి, సీపీఐ, వ్యవసాయ కార్మిక, చేతివృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం యర్రగొండపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పూల సుబ్బయ్య శాంతి భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టి, అనంతరం ధర్నా నిర్వహించి తహశీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 688 మండలాలకు గాను ఏకంగా 653 మండలాల్లో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు లేక పత్తి ఎదుగుదల లోపించిందని, వేరుశనగ విస్తీర్ణం భారీగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఇతర పైర్లు నీరందక ఎండుముఖం పట్టాయన్నారు. పంటలు లేక వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులు ఉపాధి కోల్పోయి వలసబాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశుగ్రాసం, తాగునీరు కరువై రైతులు మూగజీవాలను కబేళాలకు తెగనమ్ముకుంటున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్ర పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. రైతు, కౌలు రైతుల పంట రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేయాలని, ఉపాధి హామీ దినసరి వేతనాన్ని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. పశువులకు ఉచితంగా మేత, తాగునీరు కల్పించడంతో పాటు రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు 16 రకాల నిత్యావసరాలను ఉచితంగా అందించాలని కోరారు. రైతు సంఘ నాయకులు కె.వి.కృష్ణగౌడ్, బాణాల రామయ్య, జి.గురునాధం, మన్నె సాంబశివరావు, వై.వెంకటశివయ్య, పి.తిరుమలయ్య, గుంటూరు శ్రీను, నూర్జహాన్, పూర్ణకంటి తిరుమలయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


