సింగరాయకొండ: కన్నబిడ్డను కోల్పోయి న్యాయం కోసం రోడ్డెక్కిన ఆ తల్లి ఆవేదన అధికారుల గుండెలను కరిగించలేకపోయింది. ఈ పరిణామం చివరికి ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది. సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ పాఠశాలలో చదువుతున్న 11 ఏళ్ల తౌషిక్ ఆరు నెలల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న బాలుడి తల్లి మౌలాభి.. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని బంధువులు తెలిపారు. విష ప్రభావంతో ఆమె కిడ్నీలు, లివర్ తీవ్రంగా దెబ్బతినడంతో ఒంగోలు నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కందుకూరు డీవైఈవో రవి పాఠశాల వద్ద విచారణ చేపట్టినట్లు ఎంఈవో కత్తి శ్రీనివాసరావు తెలిపారు. కాగా, మౌలాభికి అండగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


