అంబేడ్కర్ గురుకులంలో దాహంతో అలమటిస్తున్న విద్యార్థినులు పనిచేయని మినరల్ వాటర్ ప్లాంట్ ప్రైవేటు ప్లాంటు నుంచి ట్యాంకర్‌తో అరకొర సరఫరా మంత్రి స్వామి ఇలాకాలో దుస్థితి ఇదీ.. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పరిశీలనలో బహిర్గతం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థినుల వినతి
గురుకులం
సాక్షి టాస్క్‌ఫోర్స్:
చంద్రబాబు ప్రభుత్వంలో సర్కారు పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస వసతులు కూడా లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు తాగునీటికి, వాడుక నీటికి ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో 720 మంది విద్యార్థినులున్నారు. పాఠశాలలో విద్యుత్ సరఫరా వ్యవస్థ పాతదైపోయి ఓల్టేజి హెచ్చుతగ్గులతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. ఇక్కడున్న మినరల్ వాటర్ ప్లాంట్ కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద మంజూరైన మినీ వాటర్ ప్లాంట్లు సైతం మూలనపడ్డాయి. దీంతో తాగునీటికి, వాడుక నీటికీ అవస్థలు తప్పడం లేదు.
మరమ్మతులకు గురైన మోటార్లు:
పాఠశాలలో బోర్ల నుంచి ట్యాంకుకు సరఫరా చేయటానికి మూడు మోటార్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యుత్ హెచ్చు తగ్గుల కారణంగా ఉన్న మూడు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. దీనికి తోడు తెల్లవారితే మంత్రి స్వామి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఉండటంతో అప్పటికప్పుడు మోటారు మరమ్మతు చేయించి ప్రిన్సిపాల్ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పాఠశాలలో తరచూ మోటార్లు కాలిపోవడం, వాటర్ ప్లాంట్లు మొరాయిస్తుండటంతో వాటిని మరమ్మతులు చేయించడం ప్రిన్సిపాల్‌కు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం నుంచి మెయింటినెన్స్ గ్రాంట్ సరిగా ఇవ్వకపోవడంతో ప్రిన్సిపాల్ చేతిడబ్బులు పెట్టి మరమ్మతులు చేయించాల్సి వస్తోంది. తరచూ ఈ సమస్యలు ఎదురవుతుండటంతో విసిగిపోయిన గతంలో ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాల్ రమాదేవి నెల రోజుల పాటు సెలవులో వెళ్లి తిరిగి వచ్చారు. ఆ తరువాత ఆమె బదిలీపై వెళ్లిపోయారు. ఆపై అరుణ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె కూడా ఇక్కడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేయనప్పుడు తాగటానికి ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంటు నుంచి ట్యాంకర్ తెప్పించినా ప్రస్తుత ఎండ తీవ్రతకు చాలటం లేదని, ట్యాంకరు వచ్చే వరకు నీటి కోసం వేచి ఉండాల్సిన దుస్థితి ఉందని ఒక్కోసారి గత్యంతరం లేక వాడుకనీటిని తాగుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంధువుల ద్వారా వాటర్ బాటిల్స్ తెప్పించుకుని దాహార్తి తీర్చుకుంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి విద్యార్థినులతో కలిసి భోజనం చేసే సమయంలో అరకొరగా విద్యార్థినులు తెచ్చుకున్న వాటర్‌బాటిల్స్
తాగునీరు రాకపోవటంతో నిరుపయోగంగా ఉన్న కొళాయిలు
మంచినీటి ట్యాంకరు వద్ద నీరు పట్టుకుంటున్న విద్యార్థినులు
ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటనలో
బహిర్గతమైన తాగునీటి సమస్య
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి మంగళవారం రాత్రి పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని తెలుసుకుని అప్పటికప్పుడు బయట నుంచి మినరల్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఆయన విద్యార్థినులతో కలిసి భోజనం చేసే సమయంలో విద్యార్థినుల వద్ద వాటర్ బాటిల్స్ నామమాత్రంగా ఉన్నాయి. విద్యార్థినులు భోజనం చేసి వాటర్ ట్యాంకర్ వద్దకు వెళ్లి నీరు తాగారు. ఈ విషయాన్ని విలేకరులు ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికై నా తమ సమస్యకు శాశ్విత పరిష్కారం దక్కుతుందేమోనని విద్యార్థినులు ఎదురుచూస్తున్నారు.


