గిద్దలూరు రూరల్:
అభయారణ్యంలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. నాటు తుపాకీలతో వేటాడుతూ పెద్ద పులులను సైతం హతమారుస్తున్నారు. గుండ్లకమ్మ, గిద్దలూరు, తురిమెళ్ల అటవీ రేంజ్ పరిధిలో 2022 నుంచి 2026 వరకు పెద్దపులి, దుప్పి, జింక, ఉడుము, కణతి, నెమలి, అడవి పందులు తదితర వన్యప్రాణులను వేటాడిన ఘటనల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయంటే వేటగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
గిద్దలూరు అటవీశాఖ పరిధిలోని అభయారణ్యం సుమారు 10 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇంత విస్తారమైన అటవీ ప్రాంతంలోకి వేటగాళ్లు యథేచ్ఛగా ప్రవేశించి తమకు కావాల్సిన జంతువులను వేటాడటం పలు అనుమానాలు తావిస్తోంది.
అభయారణ్యంలోకి అక్రమార్కులు, వేటగాళ్లు ప్రవేశించాలంటే స్థానిక పరిస్థితులపై అవగాహన, మార్గాలపై సమాచారం అవసరం. దీంతో అటవీశాఖలోని కొందరు సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
అటవీశాఖలోని కొందరు సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేటగాళ్లకు అటవీ ప్రాంతంలోని మార్గాలు, జంతువుల సంచారం, గస్తీ వివరాలు వేటగాళ్లకు చేరవేస్తున్నట్లు తెలిసింది.
అడవిలో యథేచ్ఛగా వేట సాగుతున్నా వేటగాళ్లను పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాచర్ల బీటులో పెద్దపులి హత్య కేసులో తన రేంజ్ పరిధికి చెందిన ఏడుగురు వేటగాళ్లను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో పాటు, ఆగస్టు 23న సంగపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కుందేలును వేటాడిన విషయం తెలిసినా కేసు నమోదు చేయకపోవడంతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు గుండ్లకమ్మ రేంజిలోని రాచర్ల బీటులో పెద్దపులి మృతి ఘటనకు సంబంధించి బీట్ ఆఫీసర్ లక్ష్మణ్‌నాయక్‌ను సెప్టెంబర్ 9న సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
వన్యప్రాణుల సంరక్షణ కోసం రేంజ్ ఆఫీసర్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వేటగాళ్ల కదలికలను గుర్తించాల్సిన బాధ్యత ఈ సిబ్బందిపై ఉంది. అయితే స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో గస్తీ కంటే ఉన్నతాధికారుల వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
బేస్తవారిపేట రేంజ్ ఆఫీసర్ వీరస్వామికి గుండ్లకమ్మ, జీటీడీ రేంజిల అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డిని కాదని సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్తవారిపేట రేంజ్ ఆఫీసర్‌కు గుండ్లకమ్మ రేంజ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు కీలక రేంజిలకు అదనపు బాధ్యతలు.. ఈ పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో నిరంతర నిఘాపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఆభయారణ్యంలో వేటగాళ్లు విచ్చలవిడిగా నాటు తుపాకీలు వినియోగిస్తున్నారు. అయితే ఈ నాటు తుపాకీలు వేటగాళ్లకు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. కార్డన్ సెర్చ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు ఎక్కడా ఈ నాటు తుపాకీలు పట్టుబడిన సందర్భాలు లేవు. మరీ వేటగాళ్లకు ఈ తుపాకీలు ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది విచారణలో తెలియాల్సి ఉంది.
ఆగస్టు 4న పెద్దపులిని చంపిన కేసులో నిందితులు (ఫైల్)
పెద్దపులికీ రక్షణ కరువు
అడవి రారాజుగా పేరొందిన పెద్దపులినీ వేటగాళ్లు వదలడం లేదు. గత రెండు నెలలుగా పెద్ద పులలే లక్ష్యంగా చేసుకొని వేట సాగిస్తున్నారు. అయితే అడవిని సంరక్షించాల్సిన అధికారులు, సిబ్బందే వేటగాళ్లకు సహకరిస్తుండటంతో వన్యప్రాణుల వేట ఆగడం లేదు.
గుండ్లకమ్మ రేంజ్‌లోని రాచర్ల బీటులో జూలై 31న పెద్దపులి హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆగస్టు 3న ఏడుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు వారి వద్ద నుంచి నాటుతుపాకీ, గొడ్డలి, పులిగోర్లు స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 28న అంబవరం బీటులో నాటుతుపాకీతో అడవిపందిని కాల్చి చంపిన కేసులో ఇద్దరిని పట్టుకున్నారు.
ఆగస్టు 9న గిద్దలూరు రేంజిలోని గయికోట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నెమలిని వేటాడారు. ఆ కేసులో నిందితులను గుర్తించి అధికారులు పట్టుకొని వారి వద్ద నుంచి నెమలి మాంసం, వేటకు ఉపయోగించే ఉచ్చులు స్వాధీనం చేసుకున్నారు.
సెప్టెంబర్ 3న గుండ్లకమ్మ రేంజిలోని దిగువమెట్ట పరిధిలో ఉడుములను వేటాడిన ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించారు.
తాజాగా సెప్టెంబర్ 8న తురిమెళ్ల రేంజ పరిధిలోని పాపినేనిపల్లె బీటులో పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మరోసారి కలకలం రేపింది.
వేటగాళ్లకు అడ్డుకట్ట ఎక్కడ?
స్ట్రైకింగ్ ఫోర్స్ ఏం చేస్తోంది?
ఇంటి దొంగలెవరు..?
విధుల్లో నిర్లక్ష్యం వహించారని..
నాటు తుపాకీలు ఎక్కడివి..?
అధికారుల మధ్య సమన్వయలోపం


