రేషన్‌ దుకాణం వద్ద డీటీ హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణం వద్ద డీటీ హైడ్రామా

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

బొట్లపాలెం పేరు చెప్తే ఫోన్‌ కట్‌చేస్తున్న డీఎస్‌ఓ ఏపీ ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ ఆదేశాలూ బేఖాతర్‌ రెండో రోజు దుకాణం తాళాలు తీయని డీలర్‌ విజయలక్ష్మి రేషన్‌ దుకాణంలో సరుకులేదని తేల్చిన ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌ప్రతాప్‌రెడ్డి సరుకు పక్కదారి పట్టడంతో ముఖం చాటేసిన డీలర్‌ రేషన్‌ దుకాణాన్ని కేసు నుంచి కాపాడేందుకు నానా తంటాలు

దర్శి: పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్నారు. మండలంలోని బొట్లపాలెం గ్రామంలో డీలర్‌ ఉల్లి విజయలక్ష్మికి చెందిన రేషన్‌ దుకాణంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, పేదలకు బియ్యం ఇవ్వకుండా.. అసలు రేషన్‌ దుకాణంలో బియ్యం దించకుండా నేరుగా పక్కదారి పట్టిస్తున్నారని ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌ రెడ్డికి వచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం ఆయన బొట్లపాలెం రేషన్‌ దుకాణం వద్దకు తనిఖీ చేసేందుకు వచ్చారు. ఆయన వస్తున్న సంగతి తెలుసుకుని సదరు రేషన్‌ దుకాణం డీలర్‌ అక్కడ లేకుండా ఉడాయించారు. కొంతసేపు వేచి ఉన్నా డీలర్‌ రాకపోవడంతో డీఎస్‌ఓ, డీటీలకు ఆ దుకాణం తీయించి సరుకు లెక్కించి నివేదిక తనకు అందించాలని ఆదేశించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లే ముందు ఈ దుకాణంలో సరుకులేదని, మొత్తం సరుకు వందశాతం పక్కదారి పట్టించారని సమాచారం ఉందని చెప్పి మరీ వెళ్లారు. అయితే ఆ షాపు యజమాని టీడీపీ నేత కావడంతో అధికారులు సైతం హైడ్రామా ఆడుతున్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు కచ్చితంగా రేషన్‌ దుకాణం తీయాలి. అయితే సదరు డీలర్‌ విజయలక్ష్మి ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పటి నుంచి రెండు రోజులుగా దుకాణం తీయడం లేదు. దీంతో నిత్యం రేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు వచ్చి దుకాణం మూసి ఉండటం చూసి వెళ్లిపోతున్నారు. గురువారం డీటీ అక్కడ ఉన్న సమయంలోనే రేషన్‌ కోసం పదుల సంఖ్యలో లబ్ధిదారులు వచ్చి వెళ్లారు. ఏపీ ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ స్థాయి వ్యక్తి తనిఖీ చేసి నివేదికలు పంపమని ఆదేశించినప్పుడు అవసరమైతే రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి తాళం పగులగొట్టి లోపల ఉన్న సరుకు నిల్వలు లెక్కించి నివేదిక అందజేయాలి. అయితే అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకు కారణం ఆ డీలర్‌షిప్‌ గ్రామ టీడీపీ నాయకుడి కుటుంబానికి చెందినది కావడమే. గురువారం సరుకు నిల్వలు లెక్కించాలని డీటీ రాధాకృష్ణ అక్కడికి వచ్చారు. వచ్చిన పని చేయకుండా అక్కడ వెంకటాచలంపల్లె గ్రామానికి చెందిన డీలర్ల సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు సుబ్బారావుతో గూడు పుఠానీ చేశారు. మరి ఏ మంతనాలు జరిగాయో కానీ లోపల ఉన్న సరుకు లెక్కించకుండానే వెళ్లిపోయారు. షాపును కేసు నుంచి కాపాడే క్రమంలో డీఎస్‌ఓ, డీటీలకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. అక్కడకు వెళ్లిన విలేకరులకు కూడా సరైన సమాధానం చెప్పకుండా డీటీ వెళ్లిపోవడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా రేషన్‌ దుకాణంలో రేషన్‌ సక్రమంగా ఇస్తున్నట్లు గ్రామంలో కొందరి చేత సంతకాలు చేయించుకుని వీఆర్వో కొత్తనాటకానికి తెరతీస్తున్నారని సమాచారం. ఈ రేషన్‌ దుకాణాన్ని కేసునుంచి కాపాడేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు నానాతంటాలు పడుతున్నారు. ఈ విషయంపై డీటీ రాధాకృష్ణను వివరణ కోరడానికి ఫోన్‌ చేయగా ఆయన ఫోన్‌లో స్పందించలేదు. డీఎస్‌ఓ అధికారిణికి ఫోన్‌చేయగా ఫోన్‌ ఎత్తి బొట్లపాలెం రేషన్‌ దుకాణం గురించి వివరణ అడగ్గానే ఫోన్‌ పెట్టేయడం గమనార్హం.

డీలర్ల సంఘం అధ్యక్షుడు సుబ్బారావుతో

మంతనాలు సాగిస్తున్న డీటీ

డీటీ అక్కడ ఉండగానే రేషన్‌ కోసం వచ్చిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement