నా బిడ్డను పూడ్చినచోటే నన్నూ పూడ్చండి.. | - | Sakshi
Sakshi News home page

నా బిడ్డను పూడ్చినచోటే నన్నూ పూడ్చండి..

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

నా బిడ్డను పూడ్చినచోటే నన్నూ పూడ్చండి..

సింగరాయకొండలో శ్రీచైతన్య నవోదయ స్కూలు వద్ద నిరసనదీక్ష చేస్తున్న మౌలాబి ఆత్మహత్యాయత్నం నా కుమారుడు మృతిచెందితే ఇంత వరకు దోషులను శిక్షించలేదు అనుమతిలేని హాస్టల్‌ నిర్వహిస్తుంటే విద్యాశాఖ చర్యలు లేవు నా మృతికి స్కూలు యాజమాన్యమే కారణం.. అంటూ సెల్ఫీ వీడియో విడుదల

సింగరాయకొండ: సింగరాయకొండలో శ్రీచైతన్య నవోదయ స్కూలు వద్ద నిరసన దీక్ష చేస్తున్న సయ్యద్‌ మౌలాబి గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ పాఠశాల విద్యార్థి అయిన తన కుమారుడు సయ్యద్‌ తౌషిక్‌ (11) మృతికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని, అనుమతి లేని హాస్టల్‌ను మూసేయాలని మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన ఆమె జూలై నుంచి స్కూలు వద్ద దీక్ష చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం దీక్షకు కూర్చున్న ఆమె.. తాను దీక్ష చేస్తున్నా పోలీసులు, విద్యాశాఖ అధికారులు స్పందించడంలేదని, స్కూలు యాజమాన్యం మాటలతో వేధిస్తోందని పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరారు. పోలీసులు ఆమెను 108లో ఒంగోలు జీజీహెచ్‌కి, ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మౌలాబి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పురుగుమందు తాగటంతో మౌలాబి కిడ్నీ ఒకటి పనిచేయటం లేదని బంధువులు చెప్పారు. శ్రీచైతన్య నవోదయ స్కూలులో ఆరో తరగతి చదువుతూ నవోదయ కోచింగ్‌ తీసుకుంటున్న సయ్యద్‌ తౌషిక్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తౌషిక్‌ టవల్‌తో బాత్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని స్కూలు యాజమాన్యం చెబుతుండగా తౌషిక్‌ మృతికి స్కూలు యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు మౌలాబి, ఆలీ ఆరోపించారు. ఈ క్రమంలో స్కూలు యాజమాన్యం ఒక ఎంపీ అండదండలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిందన్న ఆరోపణలున్నాయి. తనకు న్యాయం చేయాలని మౌలాబి ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్‌ను అర్థించారు. చివరకు హైకోర్టును ఆశ్రయించారు. స్కూలు యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్‌ను మూసేయాలని, తన లాగా మరొకరికి గర్భశోకం కలగకూడదని గత జూలై 16వ తేదీ ఆమె విద్యాశాఖ అధికారులను కోరారు. అధికారులు స్పందించకపోవడంతో ఆరోజు నుంచి పాఠశాల ముందు నిరసన దీక్ష చేపట్టారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో

పురుగుమందు తాగడానికి ముందు మౌలాబీ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘నా కుమారుడు అనుమానాస్పద మృతికి కారకులను శిక్షించాల్సిన సీఐ హజరత్తయ్య, ఎస్‌ఐ బి.మహేంద్ర లంచం తీసుకుని స్కూలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ మాపై కేసులు పెడతామని బెదిరించారు. అనుమతులు లేని హాస్టల్‌ను నిర్వహిస్తున్నారని చర్యలు తీసుకోవాలని నిరసనదీక్ష చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీనికితోడు స్కూలు యాజమాన్యం సూటిపోటి మాటలతో నేను మానసికంగా వేదన అనుభవిస్తున్నాను. నా కుమారుడు ఏ స్కూలు వద్ద చనిపోయాడో నేను కూడా అక్కడే చనిపోతాను. నా మృతదేహాన్ని నా కుమారుడు తౌషిక్‌ను పూడ్చిపెట్టిన చోటే పూడ్చాలి. నన్ను, నాకుమారుడిని దయచేసి వేరు చేయవద్దు. నా చావుకు స్కూలు యాజమాన్యమే కారణం’ అని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

మౌలాబి తాగిన పురుగుమందు డబ్బా

మౌలాబీని ఒంగోలు జీజీహెచ్‌కు తరలిస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement