ఒంగోలు సిటీ: వైద్య, ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్, గ్రాస్‌సాలరీ తదితర సమస్యలపై చేస్తున్న ఆందోళనలకు సీఐటీయూ ప్రకాశం జిల్లా కమిటీ మద్దతు తెలుపుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాలం సుబ్బారావు, యం.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేయకుండా వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ చేయాలని కోరారు. వైద్య, ఆరోగ్యశాఖలో తాత్కాలిక పద్ధతిన ఏళ్ల తరబడి పనిచేయించుకోవడం సరైనది కాదని, గతంలోనే హైకోర్టు తీర్పును వెల్లడించింది. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆప్కాస్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీరందరికీ గతంలోలా మినిమం టైమ్‌స్కేల్‌ను పునరుద్ధరించాలని చెప్పారు.
మార్కాపురం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతా సిబ్బంది నియామకానికి మాజీ సైనికుల ఎంపిక ప్రక్రియ గురువారం మార్కాపురం పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. జిల్లా సైనిక్ బోర్డు, ఏడబ్ల్యూపీఓ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికకు మొత్తం 23 మంది మాజీ సైనికులు హాజరయ్యారు. వివిధ దశల్లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియ అనంతరం 21 మంది అర్హత సాధించి ఎంపికై నట్లు ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం తెలిపారు. మాజీ సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి సేవా అనుభవాన్ని టీటీడీ భద్రతా వ్యవస్థలో వినియోగించుకునే ఉద్దేశంతో ఈ సెలక్షన్ నిర్వహించినట్లు అధికారులు చెప్పా రు. ఎంపికై న అభ్యర్థులకు తదుపరి ప్రక్రియ, విధులు, బాధ్యతలపై అధికారులు వివరించారు. ఈ ప్రక్రియలో, ఏడబ్ల్యూపీఓ గోవర్ధనరావు, ఎస్.మురళి, మార్కాపురం మాజీ సైనికుల ప్రతినిధులు శీలం హరి నారాయణరెడ్డి, ఎన్.చెన్నయ్య, రామకృష్ణయ్య, శేషసాయి, వెంకటేశ్వర్లు, తిరుమలయ్య తదితరులు పాల్గొని ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు.
పెద్దారవీడు: మండలంలో బద్వీడు, సానికవరం గ్రామాల్లో కేంద్ర జలశక్తి బృందం సీడబ్ల్యూసీ, ఎంఏఆర్‌డీ బృందం జిల్లా నోడల్ అధికారి వీ గణేష్ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ (జేఎస్‌జేబీ) 2.0 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. జల సంరక్షణ, నీటి నిర్వహణకు సంబంధించిన పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయా పనుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నీటి వనరుల సంరక్షణ, నీటి నిర్వహణ కోసం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరును, పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఏపీడీ బాలునాయక్, ఏపీఓ సాంబశివరావు, ఈసీ ఎస్ మంత్రునాయక్, ఈసీలు, టీఏలు, వీబీజీ రామ్‌జీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


