నిరసన తెలిపిన ఐదు గ్రామాల ప్రజలు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతల ఆధ్వర్యంలో పోరుబాట భారీగా మోహరించిన పోలీసు బలగాలు, పోలీసుల అడ్డంకులపై నేతల ఆగ్రహం
● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
బల్లికురవ: మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్ జలాలు మండలంలో వాగులు, చేపల చెరువుల పాలవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆగస్టు 30వ తేదీ సాగర్ జలాలు విడుదల చేసింది. 18/0 మైలు సంతమాగులూరు మండలం అడవిపాలెం వద్ద 1015 క్యూసెక్కులు, 33/0 మైలు బల్లికురవ మండలం వల్లాపల్లి లాకుల వద్ద 700 క్యూసెక్కులు పారేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆ నీటిని పక్కదారి పట్టించి రెండు మండలాల్లో అద్దంకి బ్రాంచి కాలువ ద్వారా నల్లవాగు, చేపల చెరువుకు, పవర్ ప్లాంటుకు ఎగువన సూరేపల్లి గ్రామ సమీపంలో ప్రధాన కాలువ వద్ద లీకేజ్‌తో కాలువ కట్ట ఏర్పాటు చేసుకుని కొందరు రైతులు పంట పొలాలు దుక్కులు, వరినాట్లు చేపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి 227 తాగునీటి నోటిఫైడ్ చెరువులను పూర్తిస్థాయిలో సాగర్ నీటితో నింపాలని ప్రజలు కోరుతున్నారు.
ఐరన్ ఓర్ తవ్వకాలు నిలిపేయండి
టంగుటూరు: మండలంలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు, సర్వేరెడ్డిపాలెం, యరజర్ల గ్రామాల కొండల్లో ఇనుప ఖనిజం మైనింగ్ పనులను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఒంగోలు రూరల్ మండలంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు గ్రామాల ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మైనింగ్ కారణంగా తమ భూములు, నీటి వనరులు, పశువుల మేత భూములు, జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా గ్రామస్థులు ఏకమై నిరసన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులతోపాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు గ్రామస్థులకు మద్దతుగా నిలిచారు. కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళనలో పాల్గొని మైనింగ్ పనులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో ఓపెన్‌కాస్ట్ ఇనుప ఖనిజం మైనింగ్‌తోపాటు అక్కడే శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం సుమారు 1,300 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. కొణిజేడు ప్రాంతంలో 300 ఎకరాలు, కందులూరులో 100 ఎకరాలు, మర్లపాడులో 300 ఎకరాలు, యరజర్లలో 300 ఎకరాలు, సర్వేరెడ్డిపాలెంలో 200 ఎకరాలకు పైగా భూములు ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణలో జేఎస్‌డబ్ల్యూకు 89 శాతం వాటా, ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి 11 శాతం వాటా ఉండటంపై సురేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఏపీఎండీసీ జిమ్‌టెక్స్ అనే సంస్థను తీసుకొచ్చి అనంతరం జేఎస్‌డబ్ల్యూకు అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. 2015లో మంజూరైన పర్యావరణ అనుమతులను ఆధారంగా చేసుకుని తాజా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే డ్రిల్లింగ్, తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపించారు. 2011లో కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన సమయంలోనే గ్రామస్థులు మైనింగ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారని, అప్పట్లో గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని గుర్తుచేశారు. ప్రస్తుతం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లే గ్రామస్థులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనింగ్ పనులకు సంబంధించి సరైన మైనింగ్ ప్రణాళికలు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, జాయింట్ వెంచర్ పత్రాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మైనింగ్‌తో తీవ్ర కాలుష్యం:
మైనింగ్ ప్రాంతంలోని ఇనుప ఖనిజంలో మాగ్నటైట్ శాతం తక్కువగా ఉందని, దీంతో ఖనిజాన్ని శుద్ధి చేయడానికి విస్తృతమైన ప్రక్రియ అవసరమవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ వల్ల ధూళి, వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుద్ధి ప్రక్రియకు భారీగా నీరు అవసరమవుతుందని, దీనివల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడంతోపాటు నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. స్థానికంగా సుమారు 500 ఎకరాల చెరువులు, కుంటలు, సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వంద ఎకరాలకు పైగా పశువుల మేత భూములు దెబ్బతిని పశువులకు మేత, నీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్థులు తెలిపారు. సారవంతమైన వ్యవసాయ భూములు దెబ్బతింటే రైతుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నా స్థానికులకు ఎక్కువగా ప్రమాదకరమైన, నైపుణ్యం లేని పనులే దక్కే అవకాశం ఉందని సురేష్ విమర్శించారు. మైనింగ్ పనులను తక్షణమే నిలిపేసి కలెక్టర్ స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాలని, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుపై ముందుకెళ్తే ఉద్యమమే..
గతంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన అంశంపై మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదిమూలపు సురేష్ కోరారు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా బలవంతంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామాల భవిష్యత్తు, పర్యావరణం, వ్యవసాయ భూములు, నీటి వనరులు, ప్రజల జీవనోపాధిని కాపాడేందుకు ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నామని గ్రామస్థులు స్పష్టం చేశారు. మైనింగ్ పనులు నిలిపేయాలంటూ ఐదు గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత అన్ని వర్గాల వారు తీవ్ర నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా సామరస్య పూర్వకంగా తమ నిరసనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తమ ప్రాంతాలకు నష్టం జరగకుండా కాపాడాలని జిల్లా అధికారులను డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి టీ.రాము, సీపీఎం మండల కార్యదర్శి వి.మోజెస్, కొణిజేడు నాయకులు ఎస్.కె.మీరాస్, ఎమ్.కోటయ్య, సీపీఐ మండల కార్యదర్శి టీ.ప్రభాకర్, నాయకులు ఎన్.పేరయ్య, ఈదా వెంకటరెడ్డి, బుర్ర అంకరాజు, సింగమనేని బ్రహ్మయ్య, ఈదర అమర్నాథ్, కొమ్ము సురేంద్ర, మేదరమెట్ల భరత్ రెడ్డి, శ్రీపతి విజయ్, మస్తాన్ బాబు, ఆ గ్రామాల రైతులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.


