ధరలు పెరిగాయి.. పనులు ఆగాయి | - | Sakshi
Sakshi News home page

ధరలు పెరిగాయి.. పనులు ఆగాయి

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

సంగమేశ్వర ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు పూర్తయింది 25 శాతం పనులే.. అవీ మట్టికట్ట, రాళ్ల తొలగింపే 9,500 ఎకరాలకు సాగునీరు.. 15 గ్రామాలకు తాగునీరు అందని దుస్థితి హామీలకే పరిమితమైన పాలకులు ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా విఫలమైన మంత్రి స్వామి రూ.166 కోట్లు మంజూరు చేస్తామన్న ప్రకటనకూ కార్యరూపం కరువు

మెట్ట ప్రాంత రైతుల కరువు తీర్చాలి.. బీడు భూములను సాగులోకి తేవాలి.. నాలుగు మండలాల ప్రజల దాహార్తిని తీర్చాలన్న సంకల్పంతో చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి

నిలువెత్తు నిదర్శనంగా మారింది.

రెండేళ్లుగా కూటమి ప్రభుత్వంలో పనులు ముందుకు కదల్లేదు. ఇరవై ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టులో ఇప్పటికీ పూర్తయిన పనులు పావువంతు దాటలేదు. అవి కూడా ప్రధాన నిర్మాణానికి ఉపయోగపడే స్థాయిలో కాకుండా మట్టికట్ట, రాళ్ల తొలగింపునకే పరిమితమయ్యాయి. హామీలు ఎన్నో.. ప్రకటనలు మరెన్నో.. కానీ పనుల్లో మాత్రం కదలిక

కనిపించడంలేదు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి చేస్తున్న

ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వర్షపు నీళ్లతో స్పీల్‌వే నిర్మాణ ప్రాంతం

ఇరవై ఏళ్లయినా...

పావువంతే..!

పొన్నలూరు: మాకేరు–పాలేరు నదులపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా సంగమేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొండపి నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రూ.50.50 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.34.50 కోట్లు నిర్మాణానికి, రూ.16 కోట్లు భూసేకరణకు కేటాయించారు. 2007లో పనులు ప్రారంభమై 2009 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ గడువు కాస్తా ఏళ్లుగా సాగిపోతోంది. దీంతో ఆయకట్టు కింద ఉన్న రైతులు పంటలు సాగుచేయక భారీగా నష్టపోయారు.

పావువంతు పనులే..

154 మీటర్ల పొడవున స్పిల్‌వే, 11 గేట్లు.. ఇరువైపులా 2.8 కిలోమీటర్ల మట్టికట్ట.. 0.584 టీఎంసీల నీటి నిల్వ.. ఇవీ ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్న లక్ష్యాలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనుల పురోగతి నత్తనడకనే. సుమారు రెండు దశాబ్దాలు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది.

నాలుగు మండలాలకు జీవనాడి

సంగమేశ్వరం పూర్తయితే పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల్లో 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయితే మెట్ట ప్రాంతంలో సాగు విస్తరించి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఆశలు కాగితాలకే పరిమితమయ్యాయి.

లోకేష్‌ హామీ ఏమైంది?

2023లో యువగళం పాదయాత్ర సందర్భంగా పొన్నలూరు మండలం కె.అగ్రహారంలో నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్‌ సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్‌ను మార్చి పనులు వేగవంతం చేస్తామని ప్రకటించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

ప్రకటనలే.. పురోగతి ఏదీ?

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంగమేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని పలుమార్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా పనుల్లో మాత్రం చెప్పుకోదగ్గ పురోగతి లేదు. తాజాగా రూ.166 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించినా.. ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి? పనులు ఎప్పుడు మొదలవుతాయి? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, సంబంధిత కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలేదన్న ఆరోపణలున్నాయి.

రైతుల నోట.. నష్టాల లెక్క

ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే ఈపాటికి వేల ఎకరాలు పచ్చని పంటలతో కళకళలాడేవి. కానీ నీరు లేక ఆయకట్టు భూముల్లో సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రెండు దశాబ్దాలుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతులు కోట్ల రూపాయల పంట దిగుబడిని కోల్పోయారు. ఇప్పటి వరకు సుమారు రూ.360 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

మెట్ట ప్రాంత ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాల్సిన ప్రాజెక్టు.. పాలకుల ప్రకటనలకే పరిమితమైంది. నిధులు, టెండర్లు, కాంట్రాక్టర్లు, హామీలు.. ఇలా ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రజల జీవనాడిగా భావించిన సంగమేశ్వరం.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలతో కాదు.. పనులతోనే ప్రాజెక్టు పూర్తవుతుందని, తమకు ఇక ప్రకటనలు కాదు.. నీళ్లే కావాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిర్మాణ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు మారడం, పాత ధరలకు–ప్రస్తుత ధరలకు భారీ వ్యత్యాసం రావడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. 2015లోనే అదనంగా రూ.20 కోట్లు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. పనుల వ్యయానికి అనుగుణంగా అదనపు నిధులు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో కొంతకాలం మట్టికట్ట, ఎర్త్‌వర్క్‌ పనులు జరిగాయి. అయితే హామీ మేరకు నిధులు అందకపోవడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement