40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు | - | Sakshi
Sakshi News home page

40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు

Sep 9 2026 12:41 AM | Updated on Sep 9 2026 12:41 AM

ఎల్‌నినో దెబ్బకు ఎండుతున్న ‘తెల్లబంగారం’..

కీలక దశలో వాన జాడ కరువు..

14 మండలాల్లో 19,711 హెక్టార్లు సాగు కావాల్సి ఉంది

సాగైంది మాత్రం 16,338 హెక్టార్లు

పూత, కాయలు రాలిపోతున్న వైనం

పత్తి రైతుకు రూ.16.30 కోట్లు నష్టం

నలభై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. పత్తి ఎందుకు వేశానా అని బాధపడుతున్నా. ఒక్క చినుకు కూడా పడకపోవడంతో పంట మొత్తం ఎండిపోతోంది. అప్పుడప్పుడూ నీటి తడులు ఇస్తున్నా పైరుకు సరిపోవడం లేదు. ఎండాకాలం మాదిరిగా వాతావరణం ఉంది. పంటను కాపాడుకునేందుకు రాత్రిపూట నిద్రపోకుండా నీళ్లు పెడుతున్నాం. రెండెకరాలకు ఇప్పటికే రూ.20 వేలకుపైగా ఖర్చు చేశాను. ఆ పెట్టుబడైనా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అడవి పందుల బెడద కూడా పెరిగింది.

– జానపాటి ఆవులయ్య, పత్తి రైతు

మార్కాపురం: ఖరీఫ్‌ ఆరంభంలో తొలకరి జల్లులు పలకరించడంతో ఆశగా విత్తనాలు వేసిన రైతులకు.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో కష్టాలు మొదలయ్యాయి. కీలకమైన పూత, కాయ దశలో చినుకు జాడ లేకపోవడంతో పొలాల్లో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక శాతం మార్కాపురం జిల్లా పరిధిలోని 14 మండలాల్లో పత్తి పంట సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో 19,711 హెక్టార్లలో పత్తి సాగు కావాల్సి ఉండగా.. 16,338 హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా వర్షాధారంగానే పంటను సాగుచేశారు. తొలకరి వర్షాలు ఆలస్యం కావడంతో కొంతమంది రైతులు జల్లుల కోసం ఎదురుచూశారు. అడపాదడపా కురిసిన వర్షాలతో మొక్కలు మొలకెత్తి ఎదుగుదల కనిపించలేదు. దీంతో ఎరువులు, పురుగుమందులు వినియోగించారు. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో పంట పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.

ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి

పత్తి సాగు కోసం రైతు ఎకరాకు సుమారు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. విత్తనాల కొనుగోలు, దుక్కులు, అరకలు, అంతర్‌ సేద్యం, ఎరువులు, పురుగుమందులకు ఖర్చు చేశాడు. మూడు ప్యాకెట్ల విత్తనాలు, రెండుసార్లు దున్నడం, అంతర్‌ సేద్యం, రెండుసార్లు పురుగుమందులు, ఎరువులు చల్లడం తదితర ఖర్చులు కలిపి పెట్టుబడి పెరిగిపోయింది. ఇప్పుడు పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ మొత్తం వృథా అయ్యే ప్రమాదం నెలకొంది.

పూత దశలోనే.. పంట వాడుముఖం

పత్తి పంటకు ప్రస్తుత సమయం అత్యంత కీలకం. పూత, కాయలు నిలవాలంటే నేలలో తేమ అవసరం. వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గి మొక్కలు బలహీనపడుతున్నాయి. పూత నిలవకపోవడం, కాయలు ఏర్పడకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎరువులు, బలవర్ధక మందులు వినియోగించినా వాన లేకపోవడంతో ఆశించిన ఫలితం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

బోర్లతో తడులు..

అడుగంటుతున్న భూగర్భ జలాలు

వర్షాధార పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బోర్ల ద్వారా నీటి తడులు అందిస్తున్నారు. రాత్రింబవళ్లు నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా ఎండ తీవ్రతకు ఆ తడులు సరిపోవడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండటంతో భవిష్యత్‌లో నీటి లభ్యతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ గ్రామాల్లో దయనీయ పరిస్థితి

మార్కాపురం మండలంలోని వేములకోట, జమ్మనపల్లి, చింతగుంట్ల, తిప్పాయిపాలెం, మిట్టమీదిపల్లి, నికరంపల్లి, గజ్జలకొండ, బోడపాడు, పెద్దారవీడు మండలంలోని బద్వీడు, చెర్లోపల్లి, చట్లమిట్ట, సానికవరం, తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, మీర్జపేట, తుమ్మలచెరువు, సీతానాగులవరం తదితర గ్రామాల్లో పత్తి పంట పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

రైతులకు అవగాహన..

అయినా వాన కోసం ఎదురుచూపులే

ఎల్‌నినో ప్రభావంతో పంటపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దర్శి కేవీకే శాస్త్రవేత్తలు, స్థానిక వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. నేలలో తేమను కాపాడుకోవడం, అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు. అయితే వర్షం లేకపోవడంతో పంటను కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement