టంగుటూరు:
ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు అల్లాడుతుంటే.. మరోవైపు కూటమి ప్రభుత్వం వారి జీవనాధారంపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలోని యరజర్ల, సర్వేరెడ్డిపాలెం, టంగుటూరు మండల పరిధిలోని కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల చుట్టూ ఉన్న కొండల ప్రాంతంలో ఈ కాలుష్య కర్మాగార ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుండటంతో స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు.
పచ్చని పొలాలకు ఉరి..
ఈ ఐదు గ్రామాల్లో తరతరాలుగా వరి, జొన్న, మినుము, శనగ తదితర పంటలు పండే వేలాది ఎకరాల సారవంతమైన భూములున్నాయి. పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల పంటల దిగుబడి పడిపోయి భూములు బీడుగా మారే ప్రమాదముంది. రసాయన వ్యర్థాలతో తాగునీటి చెరువులు, భూగర్భ జలాలు విషతుల్యమై రోగాల బారిన పడతామని ప్రజలు వాపోతున్నారు. వేలాది పశువులకు మేత దొరక్క పాడి పరిశ్రమ కుదేలవుతుందని, కాలుష్యం పెరిగి ప్రజలు ఊళ్లు వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా కుట్రలే..
2001లోనే చంద్రబాబు నాయుడు ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, 2013లో మర్లపాడులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఈ భూములను సిద్ధం చేస్తే, మైనింగ్ ప్రాంతమంటూ టీడీపీ నేతలు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా అనుమతులిచ్చారు. దీనిపై కలెక్టర్ రాజాబాబుకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


