ఓట్ల విభజనపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల విభజనపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

ఓట్ల విభజనపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం సాగు భూముల కోసం సీఎంకు లేఖలు బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు

కనిగిరి 7వ వార్డు ఓట్లను యథావిధిగా ఉంచాలని వినతి

కనిగిరిరూరల్‌: నిబంధనలకు విరుద్ధంగా 7వ వార్డు పరిధిలోని ఓట్లను ఇతర వార్డుల్లోకి మార్చారని ఆరోపిస్తూ కనిగిరి పట్టణ వైఎస్సార్‌ సీపీ నాయకులు మంగళవారం ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో సుమారు 200 ఓట్లను ఎటువంటి ముందస్తు సమాచారం, విచారణ లేకుండా 9వ వార్డులో కలిపారన్నారు. ఒకే ఇంట్లో 5 ఓట్లు ఉంటే మూడు ఓట్లను వేరే వార్డుకు మార్చి, రెండు ఓట్లను ఇక్కడే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ నిబంధనల ప్రకారం వార్డుల పునర్విభజన చేశారో కనీసం స్థానికులకు సమాచారం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే చీల్చారని, దీనిపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి సరిచేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కలెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షుడు భూమిరెడ్డి రామచంద్రారెడ్డి, నాయకులు కన్నేటి సుబ్బారెడ్డి, తమ్మనేని రమణారెడ్డి, తమ్మనేని వెంకటరెడ్డి, టి.రామచంద్రారెడ్డి, బి.వెంకటేశ్వరరెడ్డి, టి.వెంకటరెడ్డి పాల్గొన్నారు.

పొక్లెయిన్‌ అనుమతి కోరుతున్న చెంచు గిరిజనులు

పెద్దదోర్నాల: తాము సాగు చేసుకుంటున్న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల్లో పెరిగిన పిచ్చిచెట్లను తొలగించుకునేందుకు పొక్లెయిన్‌ అనుమతి కోరుతూ ముఖ్యమంత్రికి మూకుమ్మడిగా పోస్టుకార్డులు పంపనున్నట్లు పెద్దదోర్నాల మండల పరిధిలోని చింతల, తుమ్మలబైలు చెంచు గిరిజనులు తెలిపారు. మంగళవారం గిరిజన సంఘ నాయకులు భూమని వెంకటయ్య, ఆర్తి వెంకటేశం మాట్లాడుతూ.. గతంలో తమకు పట్టాలు మంజూరైన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల్లో చిల్లచెట్లు భారీగా పెరిగి సాగుకు ఆటంకంగా మారాయన్నారు. ఈ విషయమై గత నెల 14న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఎఫ్‌ఓలకు అర్జీలు ఇచ్చామని, రెండు నెలలుగా అటవీశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా అనుమతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 22వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే చింతలలోనే రాస్తారోకో నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు.

హనుమంతునిపాడు: మండలంలోని ముప్పళ్లపాడు గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌నకు గురైనట్లు ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు. ఒంగోలు శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటున్న మువ్వ తిరుపతయ్య కుమార్తె స్థానిక చైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తాతను చూసేందుకు ఆమె ఇటీవల ముప్పళ్లపాడుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఒంగోలుకు చెందిన పిన్నిక మహేష్‌ అనే యువకుడు కారులో వచ్చి బాలికను బలవంతంగా లాక్కెళ్లినట్లు తండ్రి తిరుపతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement