మార్కాపురం టౌన్: మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటుండటంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. పది రోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర, ప్రస్తుతం ఏకంగా రూ.50 నుంచి రూ.60కి చేరింది. మార్కెట్లో మహారాష్ట్ర నుంచి దిగుమతయ్యే పాత ఉల్లి ధర రూ.60 ఉండగా, కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త గడ్డల ధర రూ.50 పలుకుతోంది. ప్రధాన మార్కెట్లలోనే ధరలు పెరగడంతో తామేమీ చేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండగా, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై ఉల్లి విక్రయించి ఉపశమనం కలిగించాలని వినియోగదారులు కోరుతున్నారు.


