మార్కాపురం: వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన కటకానిపల్లికి చెందిన ఇద్దరు యువకుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి జలదంకి నరశింగరావు మాదిగ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, రెండెకరాల భూమి ఇవ్వాలని కోరుతూ మంగళవారం స్థానిక జీజీహెచ్ ఎదుట రహదారిపై ధర్నా నిర్వహించారు. మార్కాపురం ఆర్డీవో అక్కడికి చేరుకుని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని, గల్లంతైన రాజు మృతదేహాన్ని వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పందిటి కాశిరావు, కోటయ్య, వినయ్, పులివేముల అనిల్‌తో పాటు మృతుల బంధువులు పాల్గొన్నారు.
● మార్కాపురం విద్యుత్ ఎస్‌ఈ కరీం
మార్కాపురం: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు సమస్యలపై వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎస్‌ఎ.కరీం అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో డీఈఈలు, ఏడీఈఈలు, ఏఈఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, సాంకేతిక లోపాలు, వర్షాకాల ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి రెండో శనివారం సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈదురుగాలులు, వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, బలహీన స్తంభాలను సరిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ అశోక్‌కుమార్, డీఈలు ఉమాకాంత్, యుగంధర్, ఏఈఈ సీయానాయక్, ఈఈ టెక్నికల్, ఈఈ ఎంఆర్‌టీ, ఏఏవోలు, జేఏవోలు పాల్గొన్నారు.


