చీమకుర్తి: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో వార్డుల పునర్విభజన అత్యంత అశాసీ్త్రయంగా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా విభజన చేపట్టి స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తపాలాధికారి ఎబినైజర్‌ను వైఎస్సార్‌సీపీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, స్థానిక నేతలు కలిసి తమ అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట పరిధిలో నాలుగు పూర్తి వార్డులు, మరో రెండు వార్డుల్లో సగం ఓటర్లు ఉండేవారని, విభజన అనంతరం వాటిని ఐదు వార్డులుగా మార్చారని నాయకులు పేర్కొన్నారు. అయితే పాత 38, 39 వార్డులు రెండింటినీ కలిపి ఏకంగా 5,500 మంది ఓటర్లతో నూతనంగా 48వ వార్డుగా మార్చడం దారుణమన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఇతర వార్డుల్లో సగటున 2,500 నుంచి 3,000 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పేర్నమిట్టలోని 48వ వార్డులో మాత్రం 5,500 మందిని చేర్చడం ఏంటని ప్రశ్నించారు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు, భారీ భౌగోళిక విస్తీర్ణం ఉన్న ఈ వార్డులో ప్రజలకు సచివాలయ సేవలు, ప్రభుత్వ పథకాలు అందడం గగనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరం మొత్తం మీద అదనంగా 12 నూతన వార్డులను పెంచిన అధికారులు.. దాదాపు 35 వేల మంది ఓటర్లున్న పేర్నమిట్ట ప్రాంతానికి ఒక్క కొత్త వార్డు కూడా కేటాయించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఇప్పటికై నా అధికారులు పునరాలోచించి 5,500 మంది ఓటర్లున్న 48వ వార్డును తక్షణమే రెండు వార్డులుగా విభజించాలని, తద్వారా స్థానిక ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డితో పాటు వార్డుల ఇన్‌చార్జిలు ఎస్‌కే రసూల్, సాయి, రామచంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
38, 39 వార్డులను కలిపి ఒకే వార్డుగా చేయడమేంటి?
ఒంగోలులో ఎక్కడా లేని విధంగా ఒకే వార్డులో 5,500 మంది ఓటర్లేంటి?
కార్పొరేషన్‌లో 12 వార్డులు పెరిగినా.. 35 వేల మంది ఉన్న పేర్నమిట్టకు అన్యాయం
48వ వార్డును రెండుగా విభజించాలని కార్పొరేషన్ అధికారికి వైఎస్సార్ సీపీ నేతల వినతి


