ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సుడిగాలి పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సుడిగాలి పర్యటన

Sep 9 2026 12:41 AM | Updated on Sep 9 2026 12:41 AM

కనిగిరిలో అంగన్‌వాడీ కార్యకర్త డిస్మిస్‌కు సిఫార్సు కనిగిరి, మార్కాపురంలో రేషన్‌ డీలర్లపై 6ఏ కేసు నమోదుకు ఆదేశం

కనిగిరిరూరల్‌: ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. కనిగిరి, మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ షాపులు, పాఠశాలలను, ఎండీఎంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కనిగిరి పట్టణంలోని 8వ వార్డు అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రతాప్‌రెడ్డి తనిఖీ చేశారు. అంగన్‌వాడీ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో పాటు, కార్యకర్త జీ సత్యావతి విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని తదితర అంశాలపై విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవంగా నిర్ధారించుకుని అంగన్‌వాడీ కార్యకర్తపై చర్యలకు ఆదేశించారు. 8వ వార్డు అంగన్‌వాడీ కార్యకర్తను డిస్మస్‌ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘కనిగిరిలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు బాగా లేదు. నిత్యం అనేక ఫిర్యాదు వస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా చాలామంది నాకు ఫిర్యాదులు పంపిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సమయ పాలన పాటించడం లేదని నేరుగా వాట్సప్‌లో టైమింగ్‌ తో సహా పెడుతున్నారు. మీరు అసలు పట్టించుకోరా.. మీరు వారి ఆధీనంలో పనిచేస్తున్నారా.. లేక వారు మీ ఆధీనంలో ఉన్నారా..?’’ అంటూ సీడీపీఓ సరోజనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఐసీడీఎస్‌ పట్టణ పరిధిలోని 31 మంది కార్యకర్తలు, ఆయాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కనిగిరి అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

రేషన్‌ షాపుల తనిఖీ..

పట్టణంలోని పలు రేషన్‌ షాపులను ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. 12వ రేషన్‌ షాపులో స్టాక్‌ నిల్వకంటే అధికంగా 15 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. తక్షణం రేషన్‌ డీలర్‌ ఎస్‌కే బాషా పై 6ఏ కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే జెడ్పీ బాలికోన్నత పాఠశాలను, గురుకుల పాఠశాలను, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఎండీఎంను పరిశీలించారు. అనంతరం ఎస్సీ, బీసీ హాస్టల్‌ విద్యార్థినులతో ముఖా ముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ, బీసీ వెల్ఫేర్‌ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి నాలుగు గుడ్లు ఇస్తున్నారని.. త్వరలో ప్రభుత్వం ఎండీఎం రేట్లు పెంచుతారని అప్పుడు కచ్చితంగా 6 గుడ్లు విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికి 105 గ్రాముల చికెన్‌ కచ్చితంగా ఉండాలని తెలిపారు. పేద వర్గాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు.

బియ్యం సరిగా పంపిణీ చేయకుంటే

డీలర్ల వ్యవస్థకే ముప్పు:

అనంతరం ఏపీ ఫుడ్‌ కమిషనర్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ కనిగిరి నుంచి తనకు విపరీతమైన ఫిర్యాదులు రావడంతో తనిఖీలకు వచ్చినట్లు చెప్పారు. రేషన్‌ డీలర్లు పేదలకు బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నట్లు అనేక మంది ఫిర్యాదు చేశారన్నారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో రేషన్‌ డీలర్‌ వ్యవస్థకే ముప్పు తెచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. డీలర్లు ఇదే తప్పు కొనసాగిస్తే భవిష్యత్తులో పేదలకు బియ్యం బదులు నగదు ఇచ్చి డీలర్‌ వ్యవస్థనే రద్దు చేస్తే ఆలోచనలు జరుగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తహసీల్దార్‌ టీవీఎం కృష్ణా ప్రసాద్‌, జీసీడీఓ హేమలత, డీఎస్‌ఓ, డిప్యూటీ డీఈఓ జీ సంజీవి, సీడీపీఓ సరోజని, ఎంఈఓలు యూవీ నారాయణరెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, రాజాల కొండారెడ్డి, సుబ్బారావు, శివ నాయక్‌, ఆర్‌ఐ మాధవరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయండి

మార్కాపురం టౌన్‌: రేషన్‌ షాపులో ఆన్‌లైన్‌ స్టాక్‌కు, షాపులో ఉన్న స్టాకులో తేడా ఉన్నందున 33వ రేషన్‌షాపు డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పట్టణంలోని ఏకలవ్య కాలనీలో రేషన్‌షాపును తనిఖీ చేశారు. షాపు నంబర్‌ 33పై ఫిర్యాదులు రావటంతో ఆయన తనిఖీ చేయగా బియ్యం 50 కిలోలు ఎక్కువగా, గోధుమపిండి 85 కిలోలు, చక్కెర 15 కిలోలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని సదరు డీలర్‌పై కేసు నమోదు చేయలని డీఎస్‌వో అంకయ్యను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement