పామూరు, కనిగిరి, కొనకనమిట్ల దేవాలయాల్లో విగ్రహాలు అపహరించిన దొంగలు కొనుగోలుదారునితో పాటు 13 మంది అరెస్టు దాదాపు రూ.22.70 లక్షల విలువైన విగ్రహాలు స్వాధీనం విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ వి.హర్షవర్దన్ రాజు
ఒంగోలు సబర్బన్:
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను మార్కాపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దేవతా మూర్తుల విగ్రహాలు అపహరించిన మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.22.70 లక్షల విలువైన దేవతా మూర్తుల విగ్రహాలను, ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మార్కాపురం జిల్లా సీఎస్‌పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని దేవాలయాల్లో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను నియమించామన్నారు. నిందితులను పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టయిన నిందితుల్లో రావిగుంటపల్లికి చెందిన ఇండ్ల విష్ణువర్ధన్, సీఎస్‌పురానికి చెందిన తమ్మిశెట్టి రమణయ్య, గుడ్లూరు మండలం ఏలూరుపాడుకు చెందిన మల్లాల చెంచు సుబ్బారావు, పొదిలికి చెందిన సోమరాజుపల్లి ఉమా మహేశ్వరరావు, కనిగిరి మండలం వంగపాడు గ్రామానికి చెందిన కొమ్మి కాటంరాజు, సీఎస్ పురానికి చెందిన బత్తుల శ్రీను, కొత్తపట్నం మండలం పల్లెపాలేనికి చెందిన పిన్నీ రాజీవ్, ఒంగోలు కమ్మపాలేనికి చెందిన కమ్మ సూర్యతేజ, ఎన్‌జీపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామానికి చెందిన మోకా ఆంజనేయులు, అద్దంకికి చెందిన డేరంగుల వెంకట రమణ, సీఎస్‌పురం వడ్డెపాలేనికి చెందిన బండారు తిరుపతయ్య, గిద్దలూరుకు చెందిన దూదేకుల నాగూర్ షరీఫ్, వీళ్ళ వద్ద విగ్రహాలు కొనుగోలు చేసిన కొమరోలు మండలం భావాపురం గ్రామానికి చెందిన చందలూరి బాల గురవయ్యలను అరెస్ట్ చేశామన్నారు. అపహరించిన వాటిలో సీఎస్.పురం శివాలయంలో సుమారు రూ.12 లక్షల విలువైన రెండు పార్వతీ పరమేశ్వరుల పంచలోహ విగ్రహాలు, ఒక ఇత్తడి అయ్యప్ప విగ్రహం, కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో సుమారు రూ.10 లక్షల విలువైన 4.5 కేజీల వెండి కవచం, వెండి నాగాభరణం, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయంలో రూ.25 వేల విలువైన సుమారు 25 కేజీల ఇత్తడి హనుమంత వాహనం, పామూరు మండలం వగ్గంపల్లి గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవాలయంలో సుమారు రూ.50 వేల విలువైన ఇత్తడి కిరీటం, రెండు చేతుల కవచాలు మొత్తం విలువ సుమారు రూ.22,75,000 ఉంటాయన్నారు. నిందితులు బేల్దారు పనులు, మరికొందరు స్లాబ్ మిల్లర్ పనులు చేస్తుంటారు. ఆయా పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒకరికొకరికి పరిచయం ఏర్పడింది. వీరిలో విష్ణువర్ధన్ ఒక ప్రైవేట్ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు తోడుగా ఉండేవాడు. వీరిలో పాత నేరస్తుడైన సోమరాజుపల్లి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ, దేవాలయాల్లో చోరీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సలహాలు ఇచ్చేవాడు. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ చేసిన సొత్తును స్వీకరించే రిసీవర్‌గా ఉండేవాడు. ఈ విధంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు దేవాలయాలను ముందుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ, దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. దేవాలయాల్లో జరుగుతున్న ఈ వరుస దొంగతనాల కేసులు ఛేదించడంలో కృషి చేసిన కనిగిరి డీఎస్పీ పి.శ్రీధర్ బాబు, పామూరు సీఐ డి.వినోద్ కుమార్, కనిగిరి సీఐ యు.శ్రీనివాసరావు, ఎస్సైలను, వారి సిబ్బంది, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.


