ఉండాల్సిన వాటికంటే ఎక్కువ గుడ్లు ఎందుకున్నాయి గుడ్లలో తూకాలు ఎందుకు తేడా వస్తున్నాయి పిల్లలకు చెడిపోయిన గుడ్లు ఇస్తున్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతల విజయ ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం తనిఖీల నేపథ్యంలో రేషన్ దుకాణాలకు తాళాలు
దర్శి: విద్యార్థులకు వండి పెట్టాల్సిన కోడిగుడ్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారా అని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌కే ఖాదర్ మస్తాన్, ఎంఈఓ రమాదేవిల పై ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతల విజయప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, ఎస్సీ కాలనీ వద్ద అంగన్‌వాడీ కేంద్రం, పాత పోస్టాఫీసు వద్ద అంగన్‌వాడీ కేంద్రం, జిల్లాపరిషత్ బాలికల పాఠశాలల్లో ఆయన బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.
జెడ్పీబాలికల పాఠశాలలో స్టోర్‌రూంలో కొన్ని చెడిపోయిన గుడ్లు పరిశీలించారు. అనంతరం బాగున్న గుడ్లను లెక్కవేసి చూడగా 1824 గుడ్లు ఉండాల్సి ఉండగా 2160 గుడ్లు ఉన్నాయి. 336 గుడ్లు ఎక్కువ ఉన్నాయని, తేడా ఎందుకు వచ్చాయని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్ మస్తాన్‌ను ప్రశ్నించారు. ఇంత తేడాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ఎంఈఓ రమాదేవిని ప్రశ్నించారు. మాకు ఇక్కడ గుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆటోల్లో తీసుకుని వెళ్లి బయట అమ్ముకుంటున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వారు ఫిర్యాదు చేసినట్లే ఇక్కడ తేడా ఉందని చెప్పారు. రెండు బ్యాగులు రైస్‌కూడా ఎక్కువ ఉన్నాయన్నారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ డీఈఓ రంగయ్యను ఆదేశించారు. ఆయన ఇచ్చే వివరణను బట్టి జరిగిన తప్పును సుమోటోగా తీసుకుంటామని కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పారు.
ఏపీమోడల్ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడారు. తమకు పెట్టే ఉప్మా తినలేక పోతున్నామని విద్యార్థులు చెప్పగా అందుకు బదులుగా ఎగ్‌ఫ్రైడ్‌రైస్, టమోటా రైస్‌లను పెట్టాలని మెనూలో మార్పు చేశారు. ఆ తరువాత కోడిగుడ్లను లెక్కవేయగా అక్కడ కూడా తేడాలు వచ్చాయి. గత బుధవారం గుడ్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయని, మురిగిన గుడ్లు పిల్లలకు ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు. గుడ్లకు ఉండాల్సిన రంగులు లేవని చైర్మన్ ప్రశ్నించగా ఈ రంగులతోనే సరఫరా ఇచ్చారని సమాధానం ఇవ్వడం పై మండిపడ్డారు. మొదటి తప్పిదంగా వదిలేస్తున్నామని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. కేజీబీవీ స్కూల్‌లో అట్టగుడ్లను కాటా వేసి చూశారు. 300 గ్రాములు తేడా రావడంతో గుడ్లు సరఫరా చేసే వ్యక్తి ఎలా ఇలాంటి గుడ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇంత చిన్నగుడ్లు పిల్లలకు ఇస్తుంటే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ తో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.
రేషన్‌దుకాణం యజమాని పరార్:
బొట్లపాలెంలో విజయలక్ష్మికి చెందిన రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ చేసేందుకు ఫుడ్ కమిటీ చైర్మన్ అక్కడకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దుకాణదారులు రేషన్ దుకాణానికి తాళంవేసి పరారయ్యారు. దర్శి నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చుట్టూ రేషన్ దుకాణాదారులు ప్రదక్షిణలు చేయడం కనిపించింది. ఎక్కడ తమ దుకాణాలు తనిఖీలు చేస్తారోనన్న భయంతో రేషన్ షాపుల యజమానులకు ముచ్చెమటలు పట్టాయి. దుకాణాలు అన్నీ మూసి వేసి వెళ్లగా, కొందరు ఫోన్‌లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదులపై జిల్లాలో పర్యటిస్తున్నామన్నారు. బొట్లపాలెం గ్రామంలో విజయలక్ష్మీకి సంబంధించిన రేషన్ దుకాణంలోకి రైస్ రావడం లేదని, బయట నుంచి బయటే బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. గ్రామంలో ఎవరికీ రేషన్ సక్రమంగా ఇవ్వడంలేదని, బయోమెట్రిక్‌లు వేసి బియ్యం ఇవ్వడం లేదని తమకు వచ్చిన ఫిర్యాదులపై ఇక్కడకు వచ్చామన్నారు. తాము వస్తున్న విషయం తెలుసుకుని రేషన్ దుకాణం యజమాని మూసేసి వెళ్లిపోయారని చెప్పారు. డీఎస్‌ఓను దుకాణం తనిఖీ చేసి తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


