● ఎంపీ పదవిని ఆదాయాలు, వ్యాపారాలకు వాడుకునే స్వార్థపరుడు మాగుంట ● దిగజారి మాట్లాడితే భవిష్యత్‌లో ఒంగోలు ప్రజలు తిరగనివ్వరు ● మాగుంట తన రాజకీయ సమాధిని తానే తవ్వుకున్నారు ● ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలు చేసి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన రాజకీయ జీవితానికి తానే సమాధి తవ్వుకున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం తప్పు కాదు కానీ, స్థాయికి దిగజారి మాట్లాడటం మాత్రం రాజకీయ కు సంస్కారానికి నిదర్శనమని ఆక్షేపించారు. ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడారు. జగనన్నను ప్రాధేయపడి 2019లో ఎంపీ సీటు తెచ్చుకున్న మాగుంట, ఈనాడు చంద్రబాబు మెప్పు కోసం జగనన్నను విలువలు వదిలి దిగజారి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ‘‘మాగుంట..! జగనన్నను వాడు వీడు మూర్ఖుడు అని నీవు నీ నోటి దూలతో మాట్లాడిన ప్రతి మాట ఒంగోలు ప్రజలను తాకింది. మాగుంట దిగజారి మాట్లాడిన మాటలు జగనన్నను కాదు, ఒంగోలు ప్రజలను అన్నట్టు భావిస్తున్నారు. కేంద్రం సంవత్సరానికి రూ.5 కోట్లు ఎంపీ ఫండ్స్ ఇస్తుంటే, 8 శాతం కూడా ఒంగోలు ప్రజల కోసం ఖర్చు పెట్టడం ఇష్టం లేని ప్రబుద్ధుడు మాగుంట. ఎంపీ పదవిని ఆదాయాలకు, వ్యాపారాలకు తన పరిశ్రమల అభివృద్ధి కోసం వాడుకునే స్వార్థపరుడు. ఎంపీ పదవిని అడ్డు పెట్టుకొని ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులు, అక్రమ వ్యాపారాలు అన్నీ ప్రజల ముందుపెడతాం. సాయం చేసిన జగనన్నను వాడు, వీడు అని మాట్లాడిన మాగుంటను అదే ఒంగోలు ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు ‘ఒరేయ్ శ్రీనుగా’.. ‘వాడు శ్రీనుగాడు ఎక్కడ’ సంవత్సరానికి ఒక్కసారి కూడా కనబడటం లేదని మాట్లాడితే ఎలా ఉంటుంది. రేపటి నుంచి మాట్లాడమంటావా..! దిగజారి మాట్లాడితే భవిష్యత్తులో ఒంగోలు ప్రజలు మాగుంటను జిల్లాలో తిరగనివ్వరనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి కులం గురించి మాట్లాడావు.. రెడ్డి అంటేనే ఒక పెద్దరికం, ఒక హుందాతనం, రెడీ టు హెల్ప్ అంటారు. అలాంటిది నీకు సాయం చేసిన వ్యక్తిని ఇంత దిగజారి మాట్లాడిన మాగుంట ఇకపై ‘నేను రెడ్డి’ అంటే రెడ్లు ఆయన ముఖంపై ఉమ్మేస్తారు. వెలిగొండ ప్రాజెక్టును కట్టింది, నీళ్లు తెచ్చింది ఆనాడు పెద్దాయన వైఎస్సార్, ఈనాడు జగనన్న కాదు అని మాగుంట శ్రీనివాసులరెడ్డి తన భార్య, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలడా. ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది, నీళ్లు ఇచ్చింది వైఎస్ కుటుంబం అని జిల్లాలో ఏ పిల్లాడిని అడిగిన చెబుతారు. మేలు చేసిన జగనన్నను అవమానించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, తనకు, మాగుంట కుటుంబానికి శాశ్విత రాజకీయ సమాధి కట్టాడు. ఐదేళ్లకు ఒకసారి పార్టీ మార్చే మాగుంట మాట్లాడిన దిగజారిన భాషకు చరిత్ర ఏదో ఒక రోజున తప్పక సమాధానం చెబుతుంది’’ అని చెవిరెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వై.రమేష్, డి.అంజిరెడ్డి, డి.రమణయ్య, బుజ్జి, దాసరి కరుణాకర్, దేవ, ప్రసన్న, శ్రీకాంత్, యోహాన్, పీటర్ పాల్గొన్నారు.


