ప్రకాశం గుండెల్లో రాజసం | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం గుండెల్లో రాజసం

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

దివికేగి ఏళ్లు గడుస్తున్నా ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు నిత్యనూతనంగా వెలుగొందుతూనే ఉన్నాయి. కరవు నేల ప్రకాశం జిల్లాను ప్రగతి బాట పట్టించి, పశ్చిమ ప్రాంత ప్రజల దశాబ్దాల సాగు, తాగునీటి స్వప్నాలకు ప్రాణం పోసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడం, గుండ్లకమ్మను పూర్తి చేయడం, పేదల ముంగిట్లోకి కార్పొరేట్‌ వైద్యాన్ని తెచ్చిన రిమ్స్‌ కళాశాల నిర్మాణం వంటి విప్లవాత్మక నిర్ణయాలతో జిల్లా రూపురేఖలనే మార్చేశారు. నేడు మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నాటి ఆయన సంకల్పం, తండ్రి బాటలోనే తనయుడు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించిన ప్రగతి ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

మార్కాపురం:

మ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకాశం జిల్లా అభివృద్ధిపై తనదైన చెరగని ముద్ర వేశారు. 1996లో చంద్రబాబు శంకుస్థాపనకే పరిమితం చేసి వదిలేసిన వెలిగొండ ప్రాజెక్టును ‘జలయజ్ఞం’లో చేర్చి పనులను పరుగులు పెట్టించిన ఘనత ఆయనదే. ఉచిత విద్యుత్‌, పావలా వడ్డీ రుణాలు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి విప్లవాత్మక పథకాలతో కోట్లాది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. 2004కు ముందు ప్రకాశం జిల్లా తీవ్ర వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడేది. సరైన సాగునీటి ప్రాజెక్టులు లేక రైతులు కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడగా, చిన్న అనారోగ్య సమస్య వచ్చినా గుంటూరు లేదా కర్నూలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్సార్‌ జిల్లా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు.

సముద్రం పాలవుతున్న వరద నీటిని ఒడిసిపట్టి రైతులకు అందించాలన్న సంకల్పంతో రూ.543.43 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. 9 మండలాల పరిధిలోని 84 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఒంగోలు నగరంతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మందికి రక్షిత తాగునీటిని సమకూర్చి, 2008 నవంబరు 24న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందించేందుకు మరో రూ.100 కోట్లతో కాలువల ఆధునీకరణను పూర్తి చేసింది. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.22 కోట్లతో రామన్నకతువ నిర్మాణానికి వైఎస్సారే శ్రీకారం చుట్టారు. గిద్దలూరు సమీపంలోని నల్లమల అభయారణ్యంలో రూ.12 కోట్లతో వైఎస్సార్‌ చేపట్టిన బైరేనిగుండాల ప్రాజెక్టు పనులు పట్టాలెక్కాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో నీటి భద్రతను పటిష్టం చేసే దిశగా వైఎస్సార్‌ బాటలో అడుగులు వేశారు వైఎస్‌ జగన్‌. 2019–24 మధ్య రూ.400 కోట్లతో నాగార్జున సాగర్‌ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. ఫలితంగా త్రిపురాంతకం, పుల్లలచెరువు, దర్శి, చీమకుర్తి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లోని 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. అలాగే మార్కాపురం మండలంలోని గొట్టిపడియ వద్ద సుమారు రూ.1200 కోట్లతో చేపట్టిన ఇన్‌టెక్‌ వెల్‌ ట్యాంకు నిర్మాణం ద్వారా మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 500కు పైగా గ్రామాలకు వెలిగొండ జలాలు అందనున్నాయి. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం పనులు వివిధ దశలో ఉన్నాయి.

పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ నాడు రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్‌ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీజీహెచ్‌గా సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అదనంగా రూ.170 కోట్లు, అత్యాధునిక మౌలిక వసతుల కోసం మరో రూ. 100 కోట్లు కేటాయించి కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనికితోడు పశ్చిమ ప్రకాశం ప్రజల వైద్య కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ రూ.475 కోట్లతో మార్కాపురంలో నూతన వైద్య కళాశాల నిర్మాణాన్ని చేపట్టి 70 శాతం పనులు పూర్తి చేయడమే కాకుండా, ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం దోర్నాలలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా మంజూరు చేశారు.

నాడు 2004లో వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేసి, జిల్లాలోని 63,559 మంది రైతుల పాత కరెంటు బకాయిలను రద్దు చేయడంతో పాటు 71,321 మందికి పైగా రైతులకు ఉచిత విద్యుత్‌ అందించారు. ఇలా రైతు శ్రేయస్సు, పేదల వైద్యం, సాగు–తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తండ్రీతనయులు ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రగతిని సాధించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారు.

జలయజ్ఞంతో వెలిగొండ, గుండ్లకమ్మ పనులకు వైఎస్సార్‌ శ్రీకారం

ఆధునికీకరణ పనులతో సస్యశ్యామలమైన సాగర్‌ ఆయకట్టు

ఉచిత విద్యుత్‌, వైద్య కళాశాలలతో పేదలు, రైతులకు భరోసా

తండ్రీతనయుల పాలనలోనే జిల్లా సమగ్ర రూపురేఖలు మార్పు

నేడు మహానేత, దివంగత సీఎం వైఎస్సార్‌ వర్ధంతి

తండ్రి బాటలోనే తనయుడు

చెంతకు చేరిన జలం.. ఆయకట్టుకు జీవం

‘పవర్‌’ ఫుల్‌గా అన్నదాతలు

పేదల డాక్టర్‌ వైఎస్సార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement