హక్కుల సాధనే లక్ష్యంగా.. | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనే లక్ష్యంగా..

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

ఒంగోలు సబర్బన్‌: ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా ఆందోళనలు చేపడుతున్నామని ఏపీ అమరావతి జేఏసీ ప్రకాశం జిల్లా కమిటీ చైర్మన్‌ జి.ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు మంగళవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రకాశం భవన్‌లోని పలు విభాగాల్లో, కలెక్టరేట్‌లోని పలు సెక్షన్లలో పర్యటించారు. ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అమరావతి జేఏసీ ఉద్యమ కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా మొదటి రోజు కలెక్టర్‌ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందించామన్నారు. తదుపరి సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని విధులకు హాజరు కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా 3 వ తేదీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టర్‌ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మెన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొంటారని ఆంజనేయులు చెప్పారు. కార్యక్రమానికి జిల్లాలోని ఏపీజేఏసీ అమరావతి అనుబంధం సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు అన్ని ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొంటారన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిల విడుదల చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ బకాయిలను చెల్లించాలని, సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించాలని, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా కార్యదర్శి పోలయ్య, ట్రెజరర్‌ బాలసుబ్రమణ్య కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఊతకొలు శ్రీనివాసరావు, ప్రశాంత్‌, రాము, డ్రైవర్స్‌ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్‌, ఎలీషా, ఉమెన్‌ వింగ్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీదేవి, లావణ్య, అనంతలక్ష్మి, హసీనా, హరిత, మీనా, మేరీ గౌరీ, సెక్రటరీ జి. శ్రీనివాసులు, కె.వెంకటేశ్వర్లు, హెడ్‌మాస్టర్స్‌ సంఘం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్‌ రెవెన్యూ ఉద్యోగులు, ఏపీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులు, కోఆపరేటివ్‌ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

కలెక్టరేట్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి

విధులకు హాజరు

3వ తేదీ కలెక్టరేట్‌లో నిరసన

ఉద్యమ కార్యాచరణ ప్రారంభించామన్న

ఏపీ అమరావతి జేఏసీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement