దర్శి: ‘ఏడాదికి ఒక సారి వచ్చే పుట్టిన రోజున కూడా మా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫ్లెక్సీ కట్టకూడదా..? సంవత్సరం మొత్తం టీడీపీ ఫ్లెక్సీలే వేస్తున్నారు ఒక్కరోజు మేం ఫ్లెక్సీ వేస్తే సహించలేక మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి ఫ్లెక్సీ తీసేసేందుకు ప్రయత్నిస్తారా.. మీకు దమ్ముంటే ఫ్లెక్సీ తీయండి’ అంటూ జనసేన పార్టీకి చెందిన వారు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శి గడియారం స్తంభం సెంటర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటనతో టీడీపీ, జనసేన మధ్య దర్శి నియోజకవర్గంలో విభేదాలు తలెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. దర్శి గడియారం స్తంభం సెంటర్‌లో గతంలో టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మికి కట్టిన పాత ఫ్లెక్సీపై జనసేన పార్టీ నాయకుడు వరికూటి నాగరాజు వర్గీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమకు చెప్పకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెర్వు చిన్నా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆ ఫ్లెక్సీని తీసి వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారిని తీసుకొచ్చారు. ఫ్లెక్సీ తొలగించబోగా జనసేన నేతలు అక్కడకు భారీగా చేరుకుని అడ్డుకున్నారు. ఈ తరుణంలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ నేతలపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తమ అనుమతి తీసుకుని ఫ్లెక్సీలు వేసుకోవాలని అనగా... మిమ్మల్ని అడిగి మేం ఫ్లెక్సీలు కట్టాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కట్టిన ఫ్లెక్సీ తీయం.. ఫ్లెక్సీ మీద చెయ్యివేస్తే స్టేట్ లెవల్‌లో స్పందిస్తాం అటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదు. మీరు చేస్తున్న చేష్టలపై జనసేన సెంట్రల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారి వారి వద్దకు వచ్చి మీకు అనుమతి లేదని, అందుకే ఫ్లెక్సీ తీస్తున్నామని చెప్పగా ఆయనతో కూడా వాగ్వాదానికి దిగారు. అసలు నీ ఐడెంటిటీ చూపించు.. ఎవరు నువ్వు.. మా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీ తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఫ్లెక్సీ తీయాలంటే మాకు నోటీసు ఇచ్చి చెయ్యి వేయండి అంటూ మండిపడ్డారు. దీంతో చేసేదేమీ లేక టౌన్ ప్లానింగ్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంటకు పైగా జరిగిన ఈ వాగ్వాదంలో జనసేన–టీడీపీ నేతల మధ్య కాసేపు తోపులాట కూడా జరిగింది. జనసేన నేతలు అక్కడకు భారీగా చేరుకునే సరికి టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత పోలీసులను కాపలా పెట్టారు. సాయంత్రం వరకు ఫ్లెక్సీని తీయలేదు. ఫ్లెక్సీలో టీడీపీ నేతల ఫొటోలు పెట్టలేదనే అక్కసుతోనే జనసేన ఫ్లెక్సీ తీసేయాలని ప్రయత్నించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఆదేశాలతోనే అధికారులు ఫ్లెక్సీలు తీసేందుకు యత్నించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘ఫ్లెక్సీ’ వార్‌తో దర్శిలో టీడీపీ, జనసేన మధ్య రచ్చకెక్కిన విభేదాలు
డిప్యూటీ సీఎం పుట్టినరోజు ఫ్లెక్సీ
తొలగింపునకు టీడీపీ నేతల యత్నం
మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి
తొలగిస్తుండగా అడ్డుకున్న జనసేన శ్రేణులు
తమ అనుమతి తీసుకోవాలంటూ హుకుం
జారీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు
గడియార స్తంభం సెంటర్‌లో గంటకు పైగా తీవ్ర ఉద్రిక్తత.. తోపులాట
టీడీపీ ఇన్‌చార్జ్ ఆదేశాలతోనే అధికారుల హడావుడి అంటూ ఆరోపణలు


