ఒంగోలు టౌన్: నగర ప్రజలకు కనీసం తాగునీరు ఇవ్వడం చేతకాని టీడీపీ నాయకులు ఈ రెండేళ్లలో అంతులేని అభివృద్ధి చేశామని చెబుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. నిరుపేదలకు నివాస స్థలాలు, టిడ్కో ఇళ్లు, దళిత కాలనీల్లో పాఠశాలలు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి మౌలిక వసతులు కల్పించకుండా మాయమాటలతో మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని సుందరయ్య భవనంలో బుధఽవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్లలో డివైడర్లకు రంగులు వేసి, భాగ్యనగర్ లో వేసిన రోడ్డు చూపించి నగరమంతా అభివృద్ధి చేశామని చెప్పడం మోసపూరితమన్నారు. నగరంలో పేరుకుపోయిన సమస్యల విషయంలో ఎమ్మెల్యేని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో రోజూ మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని, గెలిచిన తరువాత నగరం నడిబొడ్డున మూడు రోజులకు ఒకసారి, శివారు ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. వారానికి రెండు డ్రమ్ముల చొప్పున నీరు సరఫరా చేస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ నిలదీశారు. గత ప్రభుత్వంలో అమృత్–2.0 పథకం కింద రూ.500 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుందని విమర్శించారు. రూ. 480 కోట్లతో వెంగముక్కలపాలెం, మహేశ్వరపురంల 280 ఎకరాలలో 20,840 మందికి పంపిణీ చేసిన ఇంటి స్థలాలను అనర్హుల పేరుతో నిలిపివేశారని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నగరంలో సుమారు 30 ఏళ్లుగా 30 వేల మంది పేద కుటుంబాలు సొంత ఇళ్లు లేక అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదిగో ఇదిగో అంటూ టిడ్కో గృహాలు ఇవ్వకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని, రెండేళ్లు గడిచినా టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. నగరం స్మశానవాటికలో గ్యాస్ క్రిమేషన్ పనిచేయకపోవడంతో ఒక్కో అంత్యక్రియలకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే విద్యుత్ క్రిమేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ రూ.80 కోట్ల అప్పుల్లో ఉందని చెబుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో 150 ఏళ్ల చరిత్ర– నగరం వెలిగిపోతుందంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దళిత కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని తెలిపారు. ట్రంక్ రోడ్డు ఒక్కటే అందంగా కనిపిస్తే చాలదని, శివారు ప్రాంతాలు, దళితులు కాలనీలు కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో జి.రమేష్, తంబి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


