ఒంగోలు సబర్బన్: వినియోగదారులకు విద్యుత్ బిల్లులు సకాలంలో ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక రామ్‌నగర్‌లోని విద్యుత్ భవన్‌లో జిల్లాకు చెందిన విద్యుత్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్, సిస్‌ట్లా వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్ రీడింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే వాడుకున్న విద్యుత్ యూనిట్లలో తేడా వస్తుందని, తద్వారా వినియోగదారునికి బిల్లులో టారిఫ్ మారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. 100 శాతం రెవెన్యూ వసూళ్లు ఉండాలని ప్రత్యేకంగా సూచించారు. బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లలో పంపిణీ నష్టాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల పరివర్తకాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. స్మార్ట్ మీటర్ల గురించి, విద్యుత్ శాఖ మీద ప్రజల అభిప్రాయం, నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు,. వాటి ప్రణాళికలు పెండింగ్ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులను వేగవంతం చేయడంతో పాటు, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఫీడర్ పెట్రోలింగ్ నిర్వహించి లోపాలను సకాలంలో గుర్తించి సరిదిద్దాలని సూచించారు. ఆధార్ సీడింగ్ విషయంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సమీక్ష అనంతరం కర్నూలు రోడ్డులోని ఒంగోలు డిస్ట్రిక్ట్ స్టోర్స్, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు సంబంధించిన ఎస్‌పీఎంను తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. తరువాత ఫీల్డ్ స్టాఫ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. డీఈటీ ఎన్.పాపారావు, ఎస్‌ఏఓ శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు హరిబాబు, వీరయ్య, శ్రీనివాసులు, మస్తాన్ రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఈఆర్‌ఓలు, ఏఏఓ, జేఏఓలు ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా విద్యుత్ శాఖ అధికారుల సమీక్షలో సీఎండీ పుల్లారెడ్డి


