పచ్చపార్టీ తాలూకా..! | - | Sakshi
Sakshi News home page

పచ్చపార్టీ తాలూకా..!

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

భూ కబ్జాలకు కేంద్రంగా ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ సిట్‌ కేసులపై అనధికార పంచాయితీ వీఆర్‌కు పంపించినా వారం రోజుల్లోనే తిరిగి పోస్టింగ్‌ అధికార పార్టీ నేతల అండదండలతో ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లు వివాదాస్పదంగా మారిన అధికారిపై చర్యలు తీసుకోలేకపోతున్న ఉన్నతాధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ భూ కబ్జాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాదంలో ఉన్న భూములకు సంబంధించి సిట్‌ చుట్టూ తిరుగుతున్న యజమానులను పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని, బలవంతంగా వారితో అగ్రిమెంట్లు చేయడం, కీలక నాయకుడి బినామీల పేర్లకు రిజిస్టర్లు చేయించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ స్టేషన్‌ అధికారిపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార టీడీపీకి చెందిన కీలక నాయకుడి అండదండలతో భూ కబ్జాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ఏకంగా కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టేంత వరకు వ్యవహారం వెళ్లింది.

వీఆర్‌కు పంపించినా తిరిగి వచ్చి..

అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్టేషన్‌ అధికారిని వీఆర్‌కు పంపించారు. అధికార పార్టీ నేతల అండదండలు, పై స్థాయిలో ఉన్నతాధికారుల సహకారంతో మళ్లీ పోస్టింగు తెచ్చుకోవడంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పరంగా ప్రతికూల ప్రభావం చూపిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

భూ కబ్జాల్లో

తలమునకలు...

నగరంలోని మైనారిటీ వర్గానికి చెందిన వారికి సంబంధించిన కొప్పోలు భూముల వివాదం విషయంలో జోక్యం చేసుకున్న సదరు అధికారి టీడీపీ నేతకు అనుకూలంగా పంచాయితీ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇందులో భారీ మొత్తంలో చేతులు మారినట్లు గుసగుసలు వినిపించాయి. ఒంగోలు వెంకట సుబ్బయ్య వ్యవహారంలో కూడా నేరుగా పోలీసు స్టేషన్లోనే పంచాయితీ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. కార్మిక నగర్‌లో 15 ఏళ్లుగా నివాసముంటున్న పేదల గుడిసెలు కూల్చడం వెనక కూడా సదరు అధికారి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ భూమి తమదని చెబుతూ రాత్రికి రాత్రి కూల్చివేయడం వివాదస్పదమైంది. నిజంగా అది ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి అయితే రెవెన్యూ అధికారులు కానీ, కార్పొరేషన్‌ అధికారులు కానీ జోక్యం చేసుకోవాలి అయితే అందుకు భిన్నంగా జరిగింది.

ఇసుక దందాలో

వసూళ్ల పర్వం..

ఇసుక మాఫియాతో సైతం స్టేషన్‌ అధికారులు చేతులు కలిపి ఇసుక వ్యాపారులను ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక ట్రాక్టర్లను పట్టుకొచ్చి తాలూకా పోలీసు స్టేషన్‌ వద్ద నిలిపి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఎన్ని ట్రాక్టర్లను మైనింగ్‌ అధికారులకు అప్పగించారో ఉన్నతాధికారులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా అసలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందంటే రాజకీయ ప్రభావం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

సిట్‌ బాధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి...

గత ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులు భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో గత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. భూ కబ్జాలపై విచారణకు సిట్‌ను నియమించింది. విచారణ దశలోనే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సిట్‌ను నిర్వీర్యం చేసింది. అంతే కాకుండా కీలక నేత కనుసన్నల్లో సిట్‌ బాధితుల లిస్టు తయారు చేసి వారిలో ఒక్కొక్కరిని తాలూకా పోలీసు స్టేషన్‌కు పిలిపించుకొని పంచాయితీలు చేయడం మొదలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కీలక నేతకు అనుకూలంగా భూ వివాదాలు పరిష్కరించుకోవాలని బాధితుల మీద ఒత్తిడి చేయడం, మాట వినకపోతే కేసులు పెడతామని బెదిరించడం వంటి అక్రమాలు జరిగినట్లు ప్రచారం సాగింది. కొంతమందిని రోజుల తరబడి పోలీసు స్టేషన్‌ చుట్టూ తిప్పుకోవడమే కాకుండా భూ యజమానులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పుకున్నారు. మాట వినని వారింటికి అర్ధరాత్రి పూట వెళ్లి భూ యజమానులపై, వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులు చేశారు. పోలీసుల బెదిరింపులకు భయపడి కొందరు భూ యజమానులు ఊరొదిలి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

భూ వివాదాలు, ప్రైవేటు సెటిల్‌మెంట్‌లకు నిలయంగా మారిందన్న ఆరోపణలు

వినిపిస్తున్నాయి. కార్మిక నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక ఈ స్టేషన్‌ అధికారి

తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు

సమాచారం. అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో సదరు అధికారి

రెచ్చిపోతున్నట్టు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. గతంలో వీఆర్‌కు పంపినా సదరు అధికారి వారంరోజుల్లో పోస్టింగ్‌ తెచ్చుకుని చెలరేగిపోతున్నారని కూటమి నేతలే విమర్శలకు దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement